చెన్నై: బ్యాగ్ భుజాన వేసుకుని వెళ్లాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. బస్సులో ఫుట్ పాత్ పై ప్రయాణిస్తూ వేట కత్తులతో వీరంగం సృష్టించారు.  కత్తులను చూపిస్తూ ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు. అసభ్యంగా అశ్లీల పాటలు పాడుతూ, తోటి ప్రయాణికులను బెదిరిస్తూ నానా హంగామా చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. 


ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వేట కత్తులతో బీభత్సం సృష్టించారు. కండక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా ఫుట్ పాత్ ప్రయాణం చేస్తూ రోడ్లపైకి కత్తులు గీస్తూ నానా హంగామా చేశారు.

అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చెన్నై పోలీసులు   నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులపై ఐపీసీ 147 (అల్లర్లు సృష్టించడం), 148 (అల్లర్లు, మరణాయుధాలు కలిగి ఉండడం), 294 (బి) (బహిరంగంగా అశ్లీల గీతాలు పాడడం, అసభ్యంగా మాట్లాడడం), 506 (II) (బెదిరింపులకు పాల్పడడం) సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
 
అరెస్ట్ అయిన విద్యార్థులను రిమాండ్ కు తరలించినట్లు  పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో ముగ్గురు మైనర్ విద్యార్ధులు కాగా.. మరో 19 ఏళ్ల విద్యార్ధి శివశంకర్ కూడా ఉన్నారు. విద్యార్థులంతా  ప్రెసెడెల్సీ కాలేజిలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించామని తెలిపారు. ప్రెసిడెన్సీ కళాశాలకు వెళ్లిన పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పాల్పడితే ఇకపై ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీసులు. 

అయితే ప్రెసిడెన్సీ కళాశాలలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. జూన్‌లో ఇదే కాలేజీకి చెందిన కొందరు విద్యార్ధులు తొలిరోజు కాలేజీలో అడుగుపెడుతున్న సందర్భంగా కత్తులు రుళిపిస్తూ బీభత్సం సృష్టించారు. వీరే కాకుండా ఇతర కాలేజీల విద్యార్ధులు కూడా బస్సుల్లో, రోడ్లపైన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పలువురిని అరెస్ట్ చేశారు. 

ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్ధులు పత్తరవాకం రైల్వే స్టేషన్లో కత్తులతో వీరంగం సృష్టించారు. పలు వాహనాలు ఛేజింగ్ చేయడంతో పాటు ముగ్గురిని గాయపర్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది.