వాలంటైన్స్ డే దగ్గరపడుతోంది. ఆ రోజున ప్రేమికులంతా ఉల్లాసంగా.. గడపాలని ఆశపడుతుంటారు. ఫిబ్రవరి 14న సెలబ్రేషన్స్ కోసం ఇప్పటి నుంచే ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారి ఆశలపై ఇప్పటి నుంచే పోలీసులు నీళ్లు జల్లుతున్నారు. ప్రేమికుల దినోత్సవం పేరుచెప్పి.. లవర్స్ శ్రుతిమించి ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని తమిళనాడు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పార్కుల్లో ఇష్టం వచ్చినట్లు తిరగడం.. అసభ్యకరమైన పనులు చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా మధురైలోని ఓ పార్కులో కొంతమంది ప్రేమికులు విచ్చలవిడిగా తిరగడాన్ని పోలీసులు గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకొని.. వాళ్ల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. పేరెంట్స్ ముందే  కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తరచూ పార్కుల్లో ప్రేమికులు శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని అందుకే దీనిపై దృష్టి సారించామని చెప్పారు. వాలంటైన్స్ డే దగ్గరపడుతుండటంతో ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటుచేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.