అతను చదివింది కేవలం ఏడో తరగతి మాత్రమే. కానీ... తాను పోలీసు అధికారినంటూ చెప్పి... ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. మరో 24మందిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... చెన్నై ఎగ్మూరుకు చెందిన 23 ఏళ్ల యువతి చెన్నై అమైందకరై నెల్సన్‌మాణిక్యం రోడ్డులోని కవిన్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌ అనే ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్నేహితులు, బంధువులను విచారించినా సమాచారం లేకపోవడంతో ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో ఆమె పనిచేసే కంపెనీ యజమాని రాజేష్ పృథ్వీ(29) అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించి అతనిని అరెస్టు చేశారు. కాగా... అతనిని విచారించగా... పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.  అతడి నుంచి ఎస్‌ఐ యూనిఫాం, నకిలీ ఐడీ, నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాన్‌కార్డు, నకిలీ ఓటరు కార్డు, బేడీలను స్వాధీనం చేసుకున్నారు.

తిరుప్పూరు నొచ్చిపాళయంకు చెందిన రాజేష్‌పృథ్వీ 7వ తరగతి వరకు చదివాడు. ప్రయివేటుగా పదోతరగతి పరీక్షలు రాసాడు. అయితే యువతులను, గృహిణిలను ఆకర్షించడంలో మహాదిట్టయిన అతడు గ్రామంలోని పలువురిని బెదిరించి, ముగ్గులోకి దించి జల్సా చేశాడు. అతడి దురాగతాలకు తల్లిదండ్రులే అడ్డుపడటంతో ఇల్లు వదిలిపారిపోయి ప్రయివేటు కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్నపాటి మోసాలకు పాల్పడేవాడు. 

మోసాలతో సమకూర్చుకున్న  డబ్బుతో జాబ్‌ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. అలాగే అనాథ మహిళా శరణాలయాలను సంప్రదిస్తూ ఇంటిపనులు, కార్యాలయాల్లో పనికి కుదిరిస్తానని మాయమాటలు చెప్పి యువతులతో వాంఛతీర్చుకునేవాడు. పైగా తన కామలీలలను రహస్యంగా వీడియో తీసి డబ్బులు గుంజేవాడు.

తాను పోలీసుశాఖలో ఎస్‌ఐ అని కొందరికి, వైద్యుడిని, ఇంజినీరునని మరికొందరికి చెప్పుకుంటూ దినేష్‌ శ్రీరామ్‌గురు, దీనదయాళన్, రాజేష్‌పృథ్వీ తదితర ఏడు పేర్లతో చలామణి అవుతూ ఏడుగురు యువతులను పెళ్లాడాడు. కొన్నినెలలు కాపురం చేసి అత్తింటివారిచి్చన నగలు, సొమ్ముతో కనుమరుగయ్యేవాడు. బాధిత యువతులు తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసు స్టేషన్లలో రాజేష్‌పై ఫిర్యాదు చేసి ఉన్నారు.