తమిళనాడు: భారీ వర్షాల కారణంగా చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రాజధానిలోని పలు లోతట్టు ప్రాంతాలు-దాని పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.
భారీ వర్షాలు: తమిళనాడులో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రాజధానిలోని పలు లోతట్టు ప్రాంతాలు-దాని పరిసర ప్రాంతాల నీటమునిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రానున్న నాలుగైదు రోజుల పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. తమిళనాడు, మహే సహా పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగపట్నం, తిరువారూర్, మైలదుతురై, తంజావూరు జిల్లాల యంత్రాంగం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా ఇతర పొరుగు జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గ్రేటర్ చెన్నై పోలీసులు-రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎటువంటి సంఘటననైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, హైవేస్ డిపార్ట్‌మెంట్ వరద పునరుద్ధరణ పనులు-తమిళనాడు ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూగర్భ కేబుల్ లేయింగ్ పనుల దృష్ట్యా గ్రేటర్ చెన్నై పోలీసులు గురువారం నుండి ఆదివారం వరకు గిండి ఫ్లైఓవర్ సమీపంలో జిఎస్‌టి రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు . ఈ మళ్లింపులు నాలుగు రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని బుధవారం విడుదల చేసిన పోలీసు ప్రకటనలో పేర్కొంది. అన్నా సలై వద్ద సెయింట్ థామస్ మౌంట్ వైపు వెళ్లే అన్ని వాణిజ్య-భారీ వాహనాలు గిండి వంతెన వద్ద ఎంఆర్సీ రోడ్ వైపు మళ్లించబడతాయి.
ఇదిలావుండగా, రానున్న రోజుల్లో కేరళ, తమిళనాడు, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం అంచనా వేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, వాయనాడ్ , కన్నూర్, కాసరగోడ్ ప్రాంతాలతో సహా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. సముద్రం ప్రవహించే అవకాశం ఉన్నందున, తీరం వెంబడి నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. అవసరమైతే వారిని సహాయక శిబిరాలకు తరలిస్తామని తెలిపారు. మత్స్యకారులు రానున్న కొన్ని గంటలు సముద్రంలోకి వెళ్లకూడదని గురువారం నాడు ఐంఎడీ పేర్కొంది.
చురుకైన రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం వరకు చాలా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడే అవకాశంతో పాటు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. డార్జిలింగ్, అలీపుర్‌దువార్, కూచ్‌బెహార్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ గురువారం తెలిపింది. రుతుపవనాల ద్రోణి కారణంగా జల్‌పైగురి, కాలింపాంగ్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
