కాలేజ్ స్టూడెంట్స్ కొందరు ఇటీవలి కాలంలో అనవసరమైన చర్యలతో చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా రైలులో ఆయుధాలతో హల్‌చల్ చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాలేజ్ స్టూడెంట్స్ కొందరు ఇటీవలి కాలంలో అనవసరమైన చర్యలతో చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా రైలులో ఆయుధాలతో హల్‌చల్ చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రజా రవాణా వ్యవస్థలో ఆయుధాలు ప్రయోగించడం, అనేక మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం తమిళనాడులో నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కొన్నిచోట్ల దుష్ప్రవర్తన ఘటనలు కూడా వెలుగు చూశాయి.
అయితే ఇటీవల రద్దీగా ఉన్న ఒక కదులుతున్న రైలులో విద్యార్థులు పదునైన ఆయుధాలతో విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక విద్యార్థి కొడవలి పట్టుకుని ఉండగా.. మరికొందరు పచ్చయ్యప్ప కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కనిపించారు. కొడవలి పట్టుకున్న విద్యార్థి ఫుట్‌బోర్డు మీద ప్రయాణిస్తూ ప్లాట్‌ఫామ్‌పై దానిని ఉంచి రుద్దుకుంటూ వెళ్లాడు. కొందరు విద్యార్థులైతే కాళ్లను బయట పెడుతూ ప్రమాదకర రీతిలో ప్రయాణం చేశారు. మిగిలిన విద్యార్థులు ఉత్సాహంతో అల్లరి చేయగా.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న జనాలు దానిని చూస్తూ దానిని ఉండిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు.. ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు శరణ్‌రాజ్, అభినేష్‌లను అరెస్టు చేశారు. రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. చెన్నై నగర శివార్లలోని పట్టాబిరం రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
