మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన నమీబియా, దక్షిణాఫ్రికా చీతాలకు పేరు మార్చారు.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన నమీబియా, దక్షిణాఫ్రికా చీతాలకు పేరు మార్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 25న తన మన్ కీ బాత్‌లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలకు సంబంధించి కొత్త పేర్లను సూచించమని పౌరులను కోరారు. ప్రాజెక్ట్ చీతా గురించి సాధారణ ప్రజలకు ప్రాచుర్యం కల్పించడం, చైతన్యం కలిగించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ mygov.inలో 2022 సెప్టెంబర్ 26 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు ఒక పోటీ నిర్వహించారు. ఇందుకు ప్రతిస్పందనగా చీతాలకు కొత్త పేర్లను సూచిస్తూ మొత్తం 11,565 ఎంట్రీలు వచ్చాయి. ఈ ఎంట్రీలను ఎంపిక కమిటీ పరిశీలించింది.
చీతాల పరిరక్షణ, సాంస్కృతిక విలువ కోసం సూచించబడిన పేర్ల ప్రాముఖ్యత, ఔచిత్యం ఆధారంగా నమీబియన్, దక్షిణాఫ్రికా చీతాలకు కొత్త పేర్లు ఎంపిక చేయబడ్డాయి. నమీబియా, దక్షిణాఫ్రికా చీతా కొత్త పేర్లను సూచించిన పోటీ విజేతలను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అభినందించింది. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
నమీబియా చీతాల పాత పేర్లు- కొత్త పేర్లు
టిబ్లిసి-శౌర్య
ఫ్రెడ్డీ- శౌర్య
ఎల్టన్ -గౌరవ్
సియాయా- జ్వాల
సవన్నా- నభా
ఒబాన్- పవన్
అశ- ఆశా.
దక్షిణాఫ్రికా చీతాల పాత పేర్లు-కొత్త పేర్లు..
ఫిండా అడల్ట్ ఫీమేల్-దక్ష
మాపేసు సబ్ అడల్ట్ ఫీమేల్- నిర్వా
ఫిండా అడల్ట్ మేల్1- వాయు
ఫిండా అడల్ట్ మేల్2- అగ్ని
త్స్వాలు అడల్ట్ ఫీమేల్- గామిని
త్స్వాలు అడల్ట్ మేల్-తేజస్
త్స్వాలు సబ్ అడల్ట్ ఫిమేల్-వీర
త్స్వాలు సబ్ అడల్ట్ మేల్-సూరజ్
వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ ఫీమేల్-ధీర
వాటర్‌బర్గ్ బయోస్పియర్ మేల్- ఉదయ్
వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ మేల్ 2-ప్రభాస్
వాటర్‌బర్గ్ బయోస్పియర్ అడల్ట్ మేల్3-పావక్
ఇక, భారత ఆరణ్యంలో వరి చీతాలు 1947లో నమోదు చేయబడ్డాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని సాల్ (షోరియా రోబస్టా) అడవులలో మూడు చిరుతలను కాల్చి చంపారు. భారతదేశంలో చీతాల క్షీణతకు ప్రధాన కారణాలు అడవి నుంచి జంతువులను పెద్ద ఎత్తున బంధించడం, బౌంటీ, స్పోర్ట్స్ వేట, విస్తృతమైన ఆవాసాల మార్పిడితో పాటు వేటాడే స్థావరం క్షీణించడం. ఇక, 1952లో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించబడ్డాయి.
చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ లక్ష్యం.. భారతదేశంలో ఆచరణీయమైన చిరుత జీవరాశులను స్థాపించడం, ప్రపంచ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదం చేయడం. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం..ఏటా 10 నుంచి 12 చిరుతలను ఆఫ్రికన్ దేశాల నుంచి కనీసం వచ్చే ఐదేళ్లపాటు దిగుమతి చేసుకోవాలి. 2022 జూలైలో చీతా సంరక్షణ కోసం రిపబ్లిక్ ఆఫ్ నమీబియాతో భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ఫలితంగా 2022 సెప్టెంబరులో ఎనిమిది చీతాలను నమీబియా నుంచి భారతదేశానికి బదిలీ చేసింది. ఇక, 2023 జనవరిలో దక్షిణాఫ్రికాతో చీతా సంరక్షణలో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరిలో 12 చీతా (7 మగ, 5 ఆడ) దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తరలించబడ్డాయి.
