వ్యవసాయ బిల్లులపై నిన్న ఓటింగ్‌ సందర్భంగా రాజ్యసభలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ఒకరినొకరు దూషించుకోవడం నుండి ప్రతులు చింపడం వరకు నిన్న పెద్దల సభలో జరగని రాద్ధాంతం లేదు. 

పార్లమెంట్‌లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని ఆయన ఫైర్ అయ్యారు. 

రాజ్యసభలో ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించారని, డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల వ్యవహార శైలిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

సభ్యులెవరైనా నిబంధనలు పాటించాల్సిందే అని చెప్పిన వెంకయ్య రచ్చ చేసిన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు.  ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు వెంకయ్య నాయుడు. వ్యవసాయ బిల్లు ఆమోదం సందర్భంగా, అధికార పక్షం ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. 

సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని, సభామర్యాదను ఉల్లంఘించారని, అందుకుగాను చర్యలు తీసుకుంటూ సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్‌సీ), డోలాసేన్ (టీఎమ్‌సీ), రాజీవ్ వాస్తవ్‌ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. ఈ సెషన్ ముగిసేవరకు వారు సస్పెన్షన్ లో ఉండనున్నారు.