చంద్రయాన్-3కు సంబంధించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన.. ఎప్పుడు ప్రయోగించనున్నారంటే..
చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు.

చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలైలో చంద్రయాన్-3ని ప్రయోగిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌ఎస్‌వి-01ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అనంతరం సోమనాథ్ మాట్లాడారు. ఆ సమయంలో చంద్రయాన్-3 గురించి ప్రశ్న వేయగా .. ఆ మిషన్ జూలైలో జరుగుతుందని చెప్పారు. దానిపై పూర్తి నమ్మకంగా ఉన్నట్లు సోమనాథ్ తెలిపారు.
ఇక, చంద్రయాన్-3 అనేది చంద్రునిపై సురక్షితమైన ల్యాండింగ్, సంచరించడంలో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి చంద్రయాన్-2కి తదుపరి మిషన్. ఇది ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం 3 ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు. ఇది స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, రోవర్‌లను కలిగి ఉండనుంచి. చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేసేందుకు ల్యాండర్, రోవర్ శాస్త్రీయ పేలోడ్‌లను కలిగి ఉండనుంది. ఈ మిషన్ ఇంటర్‌ప్లానెటరీ మిషన్‌లకు అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఇస్రో మరో విజయం.. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 ప్రయోగం విజయవంతం..
ఇక, 2019లో చంద్రయాన్-2ను ప్రయోగించి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కానీ సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా 2019 సెప్టెంబర్ 6న ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని పథం నుండి వైదొలిగినప్పుడు దాని ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయింది. చంద్రయాన్-2 ద్వారా పంపిన ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తుంది.