జాబిల్లిపై పరిశోధనల జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది.
జాబిల్లిపై పరిశోధనల జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3లో ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని కూడా ప్రారంభించేసింది. అయితే ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి అడుగుపెట్టిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది.
ఇస్రో షేర్ చేసిన వీడియోలో.. ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి చేరింది. ఆగస్టు 23న ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఈ దృశ్యాలను చిత్రీకరించినట్టుగా పేర్కొంది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది. ఇక, జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి గుట్టు విప్పేందుకు పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వాటి జీవితకాలం ఒక లూనార్ డే ( భూమిపై 14 రోజులకు సమానం) మాత్రమేనని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.
ఇక, చంద్రుని మీద ఉన్న ల్యాండర్, రోవర్‌లు సౌరశక్తితో నడుస్తున్నాయి. చంద్రుడిపై పగటి కాలంలో అవి సూర్యుడి నుంచి శక్తి గ్రహించి.. వాటిని విద్యుత్ శక్తిగా మార్చుకొని తమ అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. 14 రోజుల తర్వాత సౌరశక్తితో నడిచే రోవర్ కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇది ల్యాండర్ విక్రమ్‌తో తాకడం ద్వారా ఇస్రోకు డేటాను చేరవేస్తుంది. ఇస్రోకు రోవర్‌తో ప్రత్యక్ష సంబంధం లేదు.. కనుక రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు.
