Chandrayaan-3 : మరో ప్రయోగం విజయవంతం..
చంద్రయాన్ 3లో మరో ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. చంద్రుడి మీదికి ప్రవేశపెట్టడం కాదు.. అక్కడినుంచి భూమి మీదికి కూడా విజయవంతంగా తీసుకొచ్చారు.
ఢిల్లీ : భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా ఉనికిని చాటుకునేలా.. తలెత్తుకుని నిలిచేలా చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ త్రీ ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చారు. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది.
‘చంద్రుడు కక్ష నుంచి భూకక్షలోకి ప్రోపల్షన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టాం. చంద్రయాన్ త్రి అరుదైన ప్రయోగంలో ఇదొక మైలురాయి. ఇదొక కక్ష్య పెంపు విన్యాసం. ట్రాన్స్ -ఎర్త్ ఇంజక్షన్ ప్రక్రియల ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్ ను భూమికక్ష్యలోకి ప్రవేశపెట్టాం’.. అని ఎక్స్ వేదికగా ప్రకటనను ఇస్రో విడుదల చేసింది.
చంద్రయాన్ 3 ప్రొఫెల్షన్ మాడ్యూలను తిరిగి భూకక్షలోకి తీసుకురావడానికి కారణం కూడా ఇస్రో వివరించింది. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసమే ఇలా చేసినట్లుగా తెలిపింది. చంద్రుడు నుంచి భూమి మీదికి తీసుకురావడానికి ప్రణాళికలు, అమలుపై పనిచేస్తున్న క్రమంలోనే ఇది జరిగిందని చెప్పుకొచ్చింది.
వీటి కోసం సాఫ్ట్వేర్ మాడ్యూల్ అభివృద్ధి చేయబోతున్నామని, ఇలాంటి విన్యాసాల్లో తాజాగా చేపట్టింది ప్రాథమిక ప్రయోగమని ఆ ప్రకటనలో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలం మీద నియంత్రణ కోల్పోకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనివల్ల అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు.