చంద్రయాన్ -3 మిషన్ కు ఇచ్చిన మూడు లక్ష్యాల్లో ఇప్పటికే రెండింటిని పూర్తి చేసింది. మూడో లక్ష్యం కూడా పూర్తి చేసేందుకు భారత మూన్ మిషన్ పని చేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో శనివారం వెల్లడించింది.

చంద్రయాన్ -3 మిషన్ ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మూన్ మిషన్ మూడు లక్ష్యాలలో రెండింటిని సాధించింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. మూడో లక్ష్యమైన అంతర్గత శాస్త్రీయ ప్రయోగాలు అని, అది కూడా పూర్తయ్యే దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లోని అధికారిక పేజీలో పోస్ట్ చేసింది.

చంద్రయాన్-3 మిషన్ లోని పేలోడ్లన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది. ‘‘ చంద్రయాన్ -3 మిషన్: 3 మిషన్ లక్ష్యాల్లో రెండింటిని సాధించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్ ప్రదర్శన పూర్తయింది. చంద్రుడిపై రోవర్ రోవింగ్ ప్రదర్శన పూర్తయింది. అంతర్గత శాస్త్రీయ ప్రయోగాలు జరుగుతున్నాయి. అన్ని పేలోడ్లు యథావిధిగా పనిచేస్తున్నాయి’’ అని ఇస్రో శనివారం తెలిపింది.

Scroll to load tweet…

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ గా దిగడంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. కాగా.. దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొదటి, ఏకైక దేశంగా భారత్ నిలిచింది. 

ఇదిలా ఉండగా.. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ మిషన్ లో పాల్గొన్న శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమావేశమయ్యారు. ‘‘ ఈ ప్రయోగం జరుగుతున్న సమయంలో దేశంలో లేను. అందుకే భారత్ కు వచ్చిన వెంటనే నేను మొదటగా బెంగళూరుకే రావాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రవేత్తలను కలవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాను’’ అని పేర్కొన్నారు. 

ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రదేశాన్ని ‘శివ శక్తి పాయింట్’ అని, 2019 లో చంద్రయాన్ -2 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కూలిన ప్రదేశాన్ని ‘‘తిరంగా పాయింట్’’ అని పిలవాలని ప్రధాని నిర్ణయించారు. అలాగే చంద్రయాన్ -3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన చారిత్రాత్మక రోజైన ఆగస్టు 23 ను 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రధాని మోడీ ప్రకటించారు. 

కాగా.. చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకోవడానికి 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం పట్టింది. చంద్రయాన్ -3 మిషన్ 14 రోజులలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషించనున్నాయి. అమూల్యమైన శాస్త్రీయ డేటాను సేకరించనున్నాయి. 14 రోజులు తరువాత చంద్రుడిపై సూర్య కాంతి పడదు. కాబట్టి తరువాత ల్యాండర్, రోవర్ పని చేయవు. కానీ మళ్లీ అక్కడ సూర్యోదయం జరిగిన వెంటనే, వాటిని పునరుద్దరించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.