విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకే క్షణాలను యావత్ భారత్ దేశంతో, ప్రపంచం మొత్తం గుర్తుంచుకునేలా చేసేందుకు ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి పూజా హిర్వాడే బుధవారం నమో నమో భరతంబే, చంద్రయాన్ గీతంపై భరతనాట్య గీతాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మహరాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగింది.
భారత మూన్ మిషన్ విజయవంతం కావడానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. నేటి సాయంత్రం చంద్రయాన్ -3లో జాబిల్లిని తాకనుంది. ఈ నేపథ్యంలో, భారతదేశం గర్వించే ఈ అద్భుత క్షణాలను గుర్తుంచుకునేందుకు ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి పూజా హిర్వాడే బుధవారం ‘నమో నమో భరతంబే’, చంద్రయాన్ గీతంపై భరతనాట్య గీతాన్ని ప్రదర్శించారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ కొలను ఒడ్డున ఆమె ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా పూజా హిర్వాడే వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘భారతదేశానికి చెందిన చంద్రయాన్ -3 ఈ రోజు చంద్రుడిపై దిగబోతోంది. కాబట్టి ఈ క్షణాన్ని చిరస్మరణీయం చేయడానికి, చంద్రయాన్ గీతంపై భరతనాట్యాన్ని ప్రదర్శించాను. యావత్ భారతదేశం గర్వించదగ్గ, చారిత్రాత్మక ఘట్టం ఇది. ఈ రోజు ఇది సాధ్యపడేలా చేసిన శాస్త్రవేత్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.’’ అని అన్నారు.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు ముందు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా అభినందనలు తెలిపారు. అయితే ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారత్ లోని అనేక ప్రాంతాల్లో నేడు ప్రార్థనలు నిర్వహించారు. హిందువులు, ముస్లింలు తమ మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థలను చేశారు. లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ముస్లింలు నమాజ్ చేయగా.. రిషికేష్ లోని పర్మార్త్ నికేతన్ ఘాట్ వద్ద గంగా హారతి జరిగింది.
అలాగే భువనేశ్వర్, వారణాసి, ప్రయాగ్ రాజ్ లలో కొందరు 'హవన్' చేసి ప్రార్థనలు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించారు. వడోదరకు చెందిన చిన్నారుల బృందం చంద్రయాన్-3 సురక్షితంగా దిగాలని ప్రార్థనలు చేశారు. ప్రపంచంలోని నలు మూలల నుంచి ట్విట్టర్ లో ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా.. ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది. ల్యాండింగ్ లైవ్ చర్యలు ఇస్రో వెబ్సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్బుక్, పబ్లిక్ బ్రాడ్కాస్టర్ డీడీ నేషనల్ టీవీలో ఆగస్టు 23, 2023 సాయంత్రం 5:27 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుండగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.
