న్యూఢిల్లీ:భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2  చంద్రుడి ఫోటోను తీసింది. చంద్రయాన్-2 తీసిన తొలి ఫోటోను ఇస్రో విడుదల చేసింది. గురువారం నాడు ఇస్రో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నెల 21వ తేదీన ఈ ఫోటోను తీసినట్టుగా ఇస్రో ప్రకటించింది.

 

చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్న దశలో ఉపగ్రహ కక్ష్యను బుధవారం మరింత తగ్గించారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రునిపైకి ల్యాండర్ దిగనుంది. ఈ తరుణంలో బుధవారం నాడు మధ్యాహ్నం 12: 50 గంటలకు 20 నిమిషాల పాటు ఇంజిన్ ను మండించి కక్ష్యను కుదించారు.

చంద్రుడి ఉపరితలానికి 2600 కి.మీ. ఎత్తులో తీసిన ఫోటో అని ఇస్రో ప్రకటించింది. ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక బిలాన్ని ఇస్రో గుర్తించింది.