జాబిల్లిపై విశ్రాంతి తీసుకుంటున్న విక్రమ్ ను ఫొటో తీసిన చంద్రయాన్-2 ఆర్బిటాల్.. ల్యాండర్ ఇప్పుడెలా ఉందంటే ?
చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్లీమ్ మోడ్ లో ఉన్న విక్రమ్ ల్యాండర్ ను చంద్రయాన్ -2 ఆర్బిటాల్ ఫొటో తీసింది. ఈ ఫొటోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఈ ఆర్బిటాల్ లో ఉన్న ప్రత్యేక కెమెరాలు చీకటిలో కూడా ఫొటోలు తీయగలవని పేర్కొంది.

చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి. చంద్రుడి సౌత్ పోల్ పై ప్రస్తుతం సూర్యాస్తమయం కావడంతో ఇస్రో వాటిని స్లీమ్ మోడ్ లోకి పంపించింది. అక్కడ సూర్యోదయమైన సెప్టెంబర్ 22వ తేదీ తరువాత వాటిని తిరిగి యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించనున్నారు. అది విజయవంతమైతే ల్యాండర్, రోవర్ లు తిరిగి పని చేసే అవకాశం ఉంది.
కాగా.. ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉన్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ను చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫొటో తీసింది. ఈ ఫొటోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. చంద్రయాన్ 2 ఆర్బిటాల్ లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (డీఎఫ్ఎస్ఎఆర్) పరికరం సెప్టెంబర్ 6వ తేదీన ఫొటో తీసిందని పేర్కొంది. ఇది ఎల్, ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలలో మైక్రోవేవ్లను ప్రసారం చేసి, ఉపరితలం నుండి ప్రతిబింబించే సంకేతాలను స్వీకరిస్తుందని ఇస్రో తెలిపింది.
రాడార్ ఆధారిత వ్యవస్థగా సూర్యరశ్మిపై ఆధారపడకుండానే ఫొటోలను తీయగలదని పేర్కొంది. ఈ టెక్నాలజీ లక్ష్య లక్షణాల దూరం, భౌతిక లక్షణాలు రెండింటినీ అందించగలదని స్పేస్ ఏజెన్సీ తెలిపింది.అందువల్ల, భూమి, ఇతర ఖగోళ వస్తువుల రిమోట్ సెన్సింగ్ కోసం ఎస్ఎఆర్ ఉపయోగిస్తారని పేర్కొంది. పొడవైన రాడార్ తరంగదైర్ఘ్యం డీఎఫ్ఎస్ఎఆర్ చంద్రుడి ఉపరితల లక్షణాలను కొన్ని మీటర్ల వరకు అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. గత 4 సంవత్సరాలుగా చంద్రుడి ఉపరితలాన్ని ఇమేజింగ్ చేయడం ద్వారా అధిక-నాణ్యత డేటాను డీఎఫ్ఎస్ఏఆర్ ప్రసారం చేస్తోందని, చంద్ర ధ్రువ శాస్త్రంపై ప్రధానంగా దృష్టి సారించిందని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది.
చంద్రుడి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్ -3 ల్యాండర్ విక్రమ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను నాసా ఇటీవల విడుదల చేసింది. నాసాకు చెందిన తన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ వ్యోమనౌక ఈ ఫొటోలను బంధించింది. ఈ చిత్రంలో చంద్రయాన్-3 ల్యాండర్ మధ్యలో ఉందని, విక్రమ్ చుట్టూ ప్రకాశవంతమైన కాంతివలయం, దాని నీడ కూడా కనిపిస్తోందని ప్రకటించింది.