భారత అంతరిక్ష పరిశోధన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగానికి మధ్యలో బ్రేకులు పడ్డాయి. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని పైకి చేరింది అన్న విషయం నిర్దారణ అయినప్పటికీ... దాని నుంచి ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో శాస్త్రవెత్తలు అయోమయంలో పడ్డారు. సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో నాసా కూడా రంగంలోకి దిగుతోంది. అయితే... విక్రమ్ తో సంబంధాలు తిరిగి పునరుద్ధరించడం కష్టమని  తెలుస్తోంది.

ఎందుకంటే ఈ ల్యాండర్‌ 14 రోజులు మాత్రమే (చంద్రుడిపై ఒక్కరోజు) మనుగడలో ఉంటుంది. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవ్వాల్సి ఉండగా, 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ తెలిసిందని 8వ తేదీన ఇస్రో ప్రకటించింది. అప్పటినుంచి విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ప్రతి గంట, ప్రతి నిమిషం ఇప్పుడు ఎంతో విలువైనది. విక్రమ్‌కు ఉన్న బ్యాటరీలో శక్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. తిరిగి శక్తిని నింపుకొనేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు. అలాంటప్పుడు వచ్చే వారం రోజులు ఎంతో కీలకమైనవి’అని ఇస్రో పేర్కొంది.  అయితే, హార్డ్‌ ల్యాండింగ్‌ కారణంగా విక్రమ్‌ ల్యాండర్‌కు కొంత నష్టం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.