ఆస్ట్రేలియాలో భారతీయ నటికి అవమానం జరిగింది. కేవలం భారతీయురాలు అనే ఒకే ఒక కారణంతో.. ఆమె పట్ల జాతి వివక్ష చూపించారు. అకారణంగా ఆమెను బస్సులో నుంచి కిందకు దింపేశారు. ఈ విషయాన్ని సదరు నటి స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రముఖ టీవీ నటి చాందిని భగ్వనాని.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోఉంటున్నారు. కాగా.. అక్కడ తాను జాతి వివక్షను ఎదుర్కొన్నానని ఆమె చెప్పడం గమనార్హం.. తాను మెల్ బోర్న్ నుంచి ఓ ప్రాంతానికి వెళ్లడానికి బస్సు ఎక్కినట్లు ఆమె చెప్పారు. ఆ బస్సు తనకు తెలియని రూట్ లో వెళుతుండటాన్ని గమనించి డ్రైవర్ ని ప్రశ్నించింది. అయితే.. అతని వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇదే ప్రశ్న.. మరొకరు బస్సులో వాళ్లని అడగగా.. డ్రైవర్ చాలా చక్కగా సమాధానం చెప్పాడు.

తాను అడిగింది సరిగా వినపడలేదేమో అనే భావనతో ఆమె మరోసారి అదే ప్రశ్న డ్రైవర్ ని అడిగింది. మళ్లీ కనీసం వినపడటన్లు ఆ డ్రైవర్ ప్రవర్తించడం గమనార్హం. దీంతో మ‌రింత కంగారుప‌డిన చాందిని అస‌లు ఎందుకు స్పందించ‌డం లేద‌ని అడ‌గ్గానే డ్రైవ‌ర్ ఆగ్ర‌హంతో ఊగిపోతూ క‌సురుగా వెళ్లిపొమ్మ‌న్నాడు. 

"నేను చాలా మ‌ర్యాద‌గా అడిగాను కానీ అత‌ను వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడు. 'చెత్త భార‌తీయులారా..ఇక్క‌డి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్నాను. అత‌నిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాల‌నేది తోచ‌లేదు. వ‌ణుకుతూనే బ‌స్సు దిగిపోయాను. జాతి వ‌వ‌క్ష ఇంకా ఉంది అన‌డానికి నాకు జ‌రిగిన ఈ అనుభ‌వ‌మే నిద‌ర్శ‌నం" అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయ‌డం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల అక్క‌డే చిక్కుకుపోయింది. ఆమె చివ‌రిసారిగా "సంజీవ‌ని" వెబ్‌సిరీస్‌లో క‌నిపించింది.