డబ్బు కోసం మనిషి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తాను చనిపోయినట్లుగా నమ్మించడానికి పనిమనిషిని హత్య చేసి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఆకాశ్ వద్ద రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పనిమనిషిగా ఉన్నాడు..

అయితే గత కొంతకాలంగా ఆకాశ్ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న బీమా డబ్బులు వస్తే ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించి కుటుంబసభ్యులతో కలిసి ఓ స్కెచ్ గీశాడు. గత నెలలో పనిమనిషిని చంపి అతడి మృతదేహాన్ని తన కారులోనే హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్ పట్టణానికి తరలించాడు.

ఆ తర్వాత కారుకు నిప్పంటించాడు. తన ఆచూకీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో నేపాల్‌లో తలదాచుకోవాలని నిర్ణయించాడు. పథకంలో భాగంగా కారు ప్రమాదంలో ఆకాశ్ చనిపోయాడంటూ అతని మేనల్లుడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఆకాశ్‌ మృతదేహాంగా భావిస్తున్న పనిమనిషి శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆకాశ్ చనిపోయాడని తెలిసిన తెల్లారి నుంచి అతని డెత్ సర్టిఫికేట్ కోసం కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అందరిని చనిపోయినట్లు నమ్మించడానికే పనిమనిషిని ఆకాశే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. దీంతో అతనిని పల్వాల్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.