ఓ వ్యక్తి పది నిమిషాల్లో మూడు క్వార్టర్ల మద్యం తాగుతానని స్నేహితులతో పందెం వేశాడు. ఆ తరువాత మద్యం ఓవర్ డోస్ కావడంతో మృతి చెందాడు.
ఆగ్రా : ఆగ్రాలో 45 ఏళ్ల వ్యక్తి మద్యం ఓవర్‌డోస్‌తో మరణించాడు. 10 నిమిషాల్లో మూడు క్వార్టర్ల మద్యం తాగాలని అతని ఇద్దరు స్నేహితులు అతనికి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించిన ఆ వ్యక్తి లోకల్ గా తయారయ్యే 180మి.లీ.ల మద్యాన్ని పది ని.ల్లో తాగాడు. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. అతనితో ఛాలెంజ్ చేసిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్నేహితులు ఇద్దరు చేసిన ఛాలెంజ్‌ని జై సింగ్ స్వీకరించాడు. ఈ ఘటన ఫిబ్రవరి 8న జరిగింది. జై సింగ్, ఇ-రిక్షా డ్రైవర్. ఆ తరువాత శిల్పగ్రామ్ సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో అతని 16 ఏళ్ల కుమారుడు కరణ్ కు కనిపించాడు. వెంటనే తండ్రిని సమీపంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కానీ రెండు ఆస్పత్రులు అతడికి చికిత్స చేయడానికి నిరాకరించాయి. ఆ తరువాత ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో జై మృతి చెందినట్లు ప్రకటించారు.
ఐపిసి సెక్షన్ 304 కింద ఇద్దరు స్నేహితులు - భోలా, కేశవ్ లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బహదూర్ సింగ్ మాట్లాడుతూ, "కోర్టు ఆదేశాల మేరకు భోలా, కేశవ్‌లను అరెస్టు చేసి జైలుకు పంపారు. విచారణలో, జైతో పాటు తాము ఫిబ్రవరి 8న శిల్పగ్రామ్ పార్కింగ్ సమీపంలో మద్యం తాగేందుకు కలుసుకున్నామని నిందితులు చెప్పారు." ఆగ్రాలోని దండుపురా ప్రాంతంలో నివసించే జై సింగ్ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా మైనర్ పిల్లలు.
కొడుకు కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం... ఉత్తరప్రదేశ్ లో ఘటన..
జై సోదరుడు సుఖ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ, "భోలా, కేశవ్‌లు మా సోదరుడు.. 10 సంవత్సరాలకు పైగా స్నేహితులు. అయినా కూడా.. మద్యం తాగిన తరువాత మా సోదరుడి ఆరోగ్యం క్షీణించడం గురించి వారు మాకు తెలియజేయలేదు. నిరుడు కొనుగోలు చేసిన ఈ-రిక్షా కోసం చేసిన అప్పు వాయిదా చెల్లించడానికి తీసుకువెళుతున్న రూ. 60,000 తీసుకొని అతడిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
"నా సోదరుడు చనిపోయిన తర్వాత, వారు మమ్మల్ని కలిసి, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఒత్తిడి తెచ్చారు. చివరకు, సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 12న మా సోదరుడి మృతికి కారణమైన వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసాం. ”అని సుఖ్‌బీర్ అన్నారు. ఎస్ఎన్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఇది ఆల్కహాల్ పాయిజనింగ్ కేసు, తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల విషంగా మారుతుంది. శరీరంలోని అధిక స్థాయి ఆల్కహాల్ మెదడును నియంత్రిస్తుంది. శ్వాస తీసుకోవడం, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రతల మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా మృతి చెందుతారు. ఆల్కహాల్ పాయిజన్ గా మారడం వల్ల ప్రధానంగా ఆకస్మిక గుండె ఆగిపోవడం వల్ల మరణం సంభవిస్తుంది’’
