నాలుగేళ్ల కొడుకును చంపి, బ్యాగులో కుక్కి తీసుకెళ్లిన స్టార్టప్ కంపెనీ సీఈవో.. ఎందుకలా చేసిందట అంటే..
గోవా సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టైన మహిళ బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ గా గుర్తించారు.
బెంగళూరు : గోవాలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకును చంపి, మృతదేహాన్ని బ్యాగులోకుక్కి తీసుకువెళ్లింది. ఆమె బెంగుళూరులోని ఓ స్టార్టప్ కంపెనీలో సీఈవోగా పనిచేస్తుంది. ఈ విషయం ఎలా వెలుగు చూసిందంటే…గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో తన నాలుగేళ్ల కొడుకుతో దిగిన సుచనా సేథ్ అనే మహిళ చెక్ అవుట్ అయ్యే సమయంలో ఒంటరిగా వెళ్ళింది. ఈనెల ఆరవ తేదీన గోవాకు వచ్చిన ఆమె ఆ తరువాత చెక్ అవుట్ చేసింది. ఆమె గది ఖాళీ చేసిన తర్వాత రూం క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బందికి అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది.
వారి సమాచారంతో హుటాహుటిన హోటల్ రూమ్ కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే, సుచనా సేథ్ వచ్చేప్పుడు బాబుతో వచ్చి.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె వెళ్లిన ట్యాక్సీని ట్రేస్ చేసిన పోలీసులు వెంటనే డ్రైవర్ తో కాంటాక్ట్ అయ్యారు. అప్పటికి ఆమె టాక్సీలో ప్రయాణిస్తుండడంతో.. పోలీసులతో మాట్లాడిన సుచనా సేథ్ కొడుకును తన స్నేహితుల దగ్గర వదిలిపెట్టినట్లుగా తెలిపింది.
ఆ రాత్రి ఏం జరిగిందంటే... : అభినందన్ విడుదలకు.. ప్రధాని మోదీ పాకిస్థాన్ ను ఎలా రెచ్చగొట్టారంటే..
వెంటనే గోవా పోలీసులు ఈ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన కర్ణాటక పోలీసులు సుచనా సేథ్ బెంగళూరులోకి ప్రవేశించగానే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమెను తనిఖీలు చేయగా ఆమె దగ్గరున్న ఓ బ్యాగులో చిన్నారి మృతదేహం దొరికింది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుచనా సేథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గోవా సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టైన మహిళ బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ గా గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగానే చిన్నారిని చంపిందని అనుమానిస్తున్నారు.
సుచనా సేథ్ ఎవరు?
ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ వ్యవస్థాపకురాలు సుచనా సేథ్. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె దీనికి సీఈఓగా పనిచేస్తున్నారు.
సుచనా సేథ్ రెండు సంవత్సరాల పాటు బెర్క్‌మన్ క్లైన్ సెంటర్‌లో అనుబంధ సంస్థకు పనిచేశారు. ఆ తరువాత మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెస్పాన్సిబుల్ మెషిన్ లెర్నింగ్, నైతికత, పాలనకు సహకరించారు.
ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌ని స్థాపించడానికి ముందు, సేథ్ బెంగళూరులోని బూమరాంగ్ కామర్స్‌లో సీనియర్ డేటా సైంటిస్ట్. ఆమె రేట్ ఆప్టిమైజేషన్, ఇంటిలిజెన్స్ కోసం డేటా ఆధారిత ఉత్పత్తులను డిజైన్ చేసేది. ఈ కాలంలో ఆమె రెండు పేటెంట్లను దాఖలు చేసింది. ఆమెకు ఇన్నోవేషన్ ల్యాబ్స్‌తో కూడా అనుబంధం ఉంది. సేథ్ కంపెనీ డేటా సైన్సెస్ గ్రూప్‌లో సీనియర్ అనలిటిక్స్ కన్సల్టెంట్‌గా పని చేసేవారు.
– సేథ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆస్ట్రోఫిజిక్స్‌తో ప్లాస్మా ఫిజిక్స్‌లో స్పెషలైజింగ్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు., అక్కడ ఆమె 2008లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ సాధించింది.
- ఆమె రామకృష్ణ మిషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ నుండి ఫస్ట్ ర్యాంక్‌తో సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీ నుండి ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో ఫిజిక్స్ (ఆనర్స్)లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. కళాశాల రోజుల్లో, సేథ్ క్విజ్ పోటీలలో చురుకుగా పాల్గొనేవారు.