దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఐదు రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ లేఖ రాశారు. తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఆయన లెటర్ రాశారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు హెచ్చరిక చేసింది. తెలంగాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాలకు కేంద్ర అలర్ట్ పంపింది. దేశంలో కరోనా కేసుల్లో అత్యధికంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ముందుజాగ్రత్తలపై ఫోకస్ పెట్టాలని, కేసులు పెరిగే ముప్పు ఉన్నందున జాగరూకతతో వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లెటర్ పంపారు.
రిస్క్ అసెస్‌మెంట్ చేసుకుని చర్యలు తీసుకోవాలని, కరోనాపై పోరులో ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను నీరుగార్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజేశ్ భూషణ్ ఈ ఐదు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందే ముప్పు ఉంటే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ సామూహిక పోరాటంలో కేంద్రం నుంచి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో ఒక్క కేరళ నుంచే 31.14 శాతం ఉన్నాయి. వారం రోజుల్లోనే ఇక్కడ భారీగా కేసులు పెరిగాయి. గతవారంలో 4139 కేసులు ఉండే తాజాగా ఇవి 6556కు పెరిగాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం, కోళికోడ్, పతానమిట్ట, ఇదుక్కి, అలప్పూజ, కొల్లాం, కన్నూర్, మలప్పురం, వయానాడ్‌లో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి.మే 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఎర్నాకుళంలో ఎక్కువ కేసులు (2063) నమోదయ్యాయి.
కాగా, మహారాష్ట్రలో ముంబయి సబర్బన్, ముంబయి, థానె, పూణె, రాయిగడ్, పాల్ఘర్‌లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టు కేంద్రం గుర్తించింది. కాగా, తమిళనాడులో గత వారం 335 కేసులు నమోదవ్వగా తాజాగా ఈ సంఖ్య 659కి పెరిగింది. తమిళనాడులో ఎక్కువగా చెన్నై, చెంగల్పట్టులలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. చెన్నైలో 308 కేసులు, చెంగల్పట్టులో 253 కేసులు రిపోర్ట్ అయ్యాయి.
తెలంగాణలోనూ వారం వారీ కేసులు పెరుగుతున్నాయి. గత వారం 287 కేసులు నమోదవ్వగా ఈ వారం 375కి పెరిగాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో తెలంగాణ నుంచి 1.78 శాతం కేసులు ఉన్నాయి. గత వారం కర్ణాటకలో 1003 కేసులు నమోదవ్వగా ఈ వారం 1446 కేసులు పెరిగాయి. కర్ణాటకలో బెంగళూరు అర్బన్‌లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని రాజేశ్ భూషణ్ తెలిపారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌లతోపాటు కొవిడ్ అప్రొప్రియేట్ బిహేవియర్‌నూ పాటించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
