Asianet News TeluguAsianet News Telugu

రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఆ నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం

పంజాబ్, హర్యానాల్లో ఖరీఫ్ పంట కొనుగోళ్లను వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. రేపటి నుంచే పంట కొనుగోలు చేస్తామని ప్రకటించింది. పంట కొనుగోళ్లను వాయిదా వేయడాన్ని రైతు ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

centre to procure kharif crop from tomorrow amid farmers protest
Author
New Delhi, First Published Oct 2, 2021, 8:06 PM IST

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో కనీసం పది నెలలకు పైగా నిరసనలు చేస్తున్నారు. ఈ అన్నదాతలే హర్యానా, పంజాబ్‌లలో మరో డిమాండ్‌తోనూ ఇటీవలే ఆందోళనలు చేశారు. వర్షాకాలం ఆలస్యంగా ముగుస్తున్నందున ఖరీఫ్ పంట కొనుగోళ్ల తేదీని కేంద్రం వాయిదా వేసింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్ 11 నుంచి పంట కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, రైతుల ఆందోళనలతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచే ఖరీఫ్ పంటను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్, కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే శనివారం భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ప్రకటించింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల పంట కొనుగోళ్లను అక్టోబర్ 1వ తేదీ నుంచి 11వ తేదీకి వాయిదా వేశామని తెలిపింది. అయితే, కొందరు అంతకంటే ముందే పంట కొనుగోలు చేయాలని కోరుతున్నారని పేర్కొంది. అందుకే రేపటి నుంచే పంట కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించింది.

ఈ నిర్ణయంపై రైతు ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల విజయమని కాంగ్రెస్ ప్రశంసించింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమావేశమైన సంగతి తెలిసిందే. చన్నీ సమావేశం కారణంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందనీ రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios