Asianet News TeluguAsianet News Telugu

స్కూల్స్ రీఓపెనింగ్‌పై కేంద్రం సమాలోచనలు.. త్వరలోనే రాష్ట్రాలకు మార్గదర్శకాలు

కేసులు ఇప్పుడిప్పుడు వెనుకంజ పడుతున్న తరుణంలో స్కూల్స్ రీఓపెన్ చేయాలనే డిమాండ్లు పేరెంట్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలు తెరవాలనే ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ రీఓపెనింగ్‌పై మార్గదర్శకాలు రూపొందించే అవకాశాలు ఉన్నాయి. స్కూల్స్ రీఓపెనింగ్ కోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. దాని నిపుణుల బృందాన్ని ఆదేశించినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.
 

centre to issue advisory on schools reopening
Author
New Delhi, First Published Jan 27, 2022, 7:20 PM IST

న్యూఢిల్లీ: కరోనా(Coronvirus) మహమ్మారితో స్కూల్స్(Scholls) చాలా కాలం మూతపడే ఉంటున్నాయి. సెకండ్ వేవ్ ముగియగానే మళ్లీ పాఠశాలలు ప్రారంభమైనా.. ఎంతో కాలం తెరిచి లేవు. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విజృంభించగానే మళ్లీ స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు క్లోజ్ చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. అయితే, ఇప్పుడిప్పుడే పీక్‌ను దాటినట్టు తెలుస్తున్నది. కేసులు భారీగా ఉన్నప్పటికీ తిరోగమనంలో ఉన్నట్టు అర్థం అవుతున్నది. ఇదే తరుణంలో పాఠశాలలు మళ్లీ తెరవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరెంట్స్ నుంచి స్కూల్స్ తెరవాలనే(Reopening) డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను తెరిచే విధానాలపై సమాలోచనలు జరుపుతున్నట్టు వివరించాయి. స్కూల్స్ తెరిచే అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే దాని నిపుణుల బృందానికి ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నాయి. ఈ మార్గదర్శకాలనే రాష్ట్రాలకు త్వరలోనే పంపించనున్నట్టు వివరించాయి.

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవాలని పేరెంట్స్, పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కాగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్కూల్స్‌ను మళ్లీ తెరవడంపై నిర్ణయాలు తీసుకున్నాయి. పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను కొన్ని షరతులతో తరగతులకు హాజరు కావచ్చని తెలిపాయి. 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోవాలనే కండీషన్స్ పెట్టాయి. ఆఫ్‌లైన్ క్లాసులకు అనుమతులు ఇచ్చాయి. 18 ఏళ్లుపైబడిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తప్పకుండా రెండు డోసుల టీకా తీసుకోవాలని స్పష్టం చేశాయి.

కాగా, కరోనా కేసులతో భీతిల్లిన మహారాష్ట్ర అన్ని తరగతులకు పాఠశాలలను రీఓపెనింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ తెరవాలని ప్రకటించింది. హర్యానా, ఛండీగడ్‌లు కూడా 10వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రకటనలు విడుదల చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలనే సిఫారసులను లెఫ్టినెంట్ గవర్నర్‌కు చేసింది. కాగా, తమిళనాడు ప్రభుత్వం కూడా త్వరలోనే ఇలాంటి ప్రకటన చేయనున్నట్టు తెలుస్తున్నది.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios