ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించింది. గురువారం ఉదయం 11 గంటలకు భేటీ నిర్వహించనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు చేశారు.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేట్టు చేశాయి. భారత్ సహా పలుదేశాలు తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ దేశ పౌరులను స్వదేశాలకు తరలించడానికి కసరత్తులు చేస్తున్నాయి. భారత పౌరులను ఇక్కడికి తీసుకురావడానికి కేంద్ర విదేశాంగ శాఖ అమెరికాతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ఈ ప్రకటనకు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలపై సమగ్ర వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. అఫ్ఘాన్ పరిణామాలపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని కేంద్ర విదేశాంగ శాఖకు సూచనలు చేశారని తెలిపారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదుపరి వివరాలను తెలియజేస్తారని వివరించారు.
భారత పౌరులను స్వదేశాలకు తరలించడాన్ని ప్రముఖంగా ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. తరలింపు ప్రక్రియలో భాగంగా అఫ్ఘాన్ సిక్కులు, హిందువులు, భారత పౌరులు మొత్తం 730 మందిని ఇప్పటికే భారత్‌కు సురక్షితంగా తెచ్చింది. అమెరికా, నాటో విమానాల ద్వారా 146 మంది భారతీయులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖతర్ రాజధాని దోహాకు తరలించింది. అక్కడి నుంచి వారిని సోమవారం కేంద్ర ప్రభుత్వం మనదేశానికి తీసుకువచ్చింది.
