టెక్ దిగ్గజ కంపెనీల నుంచి మీడియాను రక్షించడానికి భారత ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత మీడియాను టెక్నాలజీ మినిస్ట్రీ కాపాడుతుందని వివరించారు. ఇటువైపుగా ఇది వరకే పలు దేశాలు అడుగులు వేశాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మొదలు స్పెయిన్ వరకు టెక్ దిగ్గజాల బిజినెస్ మాడల్‌ను ప్రశ్నించి మీడియా సంస్థలకు న్యాయంగా దక్కాల్సిన రాబడిని ఇప్పించే చట్టాలు తెచ్చాయి.
న్యూఢిల్లీ: భారత న్యూస్ ఇండస్ట్రీ ద్వారా లాభాలు ఆర్జిస్తున్న టెక్ దిగ్గజాల ఆటలు మరెంతో కాలం సాగవు. టెక్ దిగ్గజాల ఆటలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. టెక్ కంపెనీల నుంచి మీడియాను రక్షించడానికి చట్టం తేవడానికి కసరత్తులు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. బిగ్ టెక్ కంపెనీల నుంచి భారత మీడియాను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంపై పని చేస్తున్నదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇండియా టుడేకు తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజాల చేతిలో ఇండియన్ మీడియా మోసపోకుండా, వారికి తగిన ప్రతిఫలం పొందేలా ఈ చట్టం ఉంటుందని వివరించారు.
టెక్నాలజీ మినిస్ట్రీ భారత మీడియాను కాపాడుతుందని ఆయన తెలిపారు. భారత మీడియాను కాపాడటానికి చట్టాలు అవసరం అని వివరించారు. ఇప్పటికే చాలా దేశాలు అటువైపుగా అడుగులు వేశాయని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తొలిగా ఏం చూడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా బిగ్ టెక్ కంపెనీల బిజినెస్ మాడల్‌పై జాగరూకం అవుతున్నది. ఈ కంపెనీలు పాటిస్తున్న బిజినెస్ మాడల్ మీడియా సంస్థలు, పబ్లిషర్లను దెబ్బతీస్తున్నాయి.
మీడియా హౌజ్‌లకు రెవెన్యూ
ఇంటర్నెట్ బూమ్ కారణంగా చాలా మంది ఏ సమాచారం కావాలన్న అంతర్జాలంలోనే సెర్చ్ చేస్తున్నారు. యూజర్లకు కావాల్సిన కంటెంట్ అందిస్తున్న మీడియా సంస్థలు, వెబ్‌సైట్లకు టెక్ దిగ్గజాలు తగిన మొత్తంలో రాబడిని పంచుకోవడం లేదు. దీనిపై నిలదీయడానికీ అవేమీ చిన్న సంస్థలు కాకపోవడం.. కొన్నిసార్లు ఆ కేటగిరీల్లో అవే ఎదురులేని స్థితికి చేరుకోవడం కూడా కష్టంగా మారింది. ఇంటర్నెట్‌లో ఏ సమాచారం వెతకాలన్న గూగుల్‌ను, సోషల్ మీడియాలో కంటెంట్ ఎక్కువ యూజర్లకు చేరువ చేస్తున్న ఫేస్‌బుక్ వంటి సంస్థలు పోటీ లేనివి నిలుస్తున్నాయి. దీంతో వాటిని రాజీకి తెచ్చి.. వాటి రాబడిలో మీడియా సంస్థలకు చెల్లించేలా చేయడం కష్టంతో కూడుకున్న పని. కానీ, ఈ పనిని ఇప్పటికే కొన్ని దేశాలు విజయవంతంగా పూర్తి చేశాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయబద్ధంగా కంటెంట్ అందిస్తున్న మీడియా సంస్థలు, వెబ్‌సైట్లకు చెందాల్సిన మొత్తాలను ఈ కంపెనీల నుంచి చెల్లించేలా నిబంధనలు రూపొందించే పనిలో ఉన్నది. ఇండియన్ డేటా పవర్ విషయంపై భారత ప్రభుత్వం ఎట్టకేలకు మేలుకుందని, చర్యలు తీసుకునే పనిలో పడటం ప్రశంసనీయం అని సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ వివరించారు. భారత కంటెంట్ ఆధారంగా విదేశీ సంస్థలు లాభాలు దన్నుకోవడం ఆపాలని పేర్కొన్నారు. భారత మీడియా సంస్థలు టెక్ సంస్థల ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాన వివాదం ఏమంటే.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు మీడియా సంస్థలతో రాబడిని పంచుకోవడమేనని వివరించారు.
ఒక యూజర్ గూగుల్‌లో తనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేస్తే.. గూగుల్ అందుకు అవసరమైన ఆర్టికల్‌ను ఓ వెబ్‌సైట్ నుంచి చూపిస్తుంది. అయితే.. యూజర్ సెర్చ్‌తో గూగుల్ సంపాదిస్తుంది. కానీ, ఆ ఆర్టికల్ పబ్లిష్ చేసిన వెబ్‌సైట్ పొందడం లేదు. ఇది అన్యాయం అని నిపుణులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో మీడియాకు అనుగుణమైన చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం, ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌ల సెర్చ్‌కు అవసరమైన కంటెంట్‌ను లింక్ చేస్తే.. ఆ ఆర్టికల్ పబ్లిషర్‌కు మనీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు, మీడియా హౌజ్‌కు మధ్య రాబడి పంపకాలపై ఏకాభిప్రాయం రాకుంటే.. జోక్యం చేసుకుని సెటిల్ చేయడానికి ఓ ఆర్బిట్రేటర్‌నూ ఏర్పాటు చేసింది. ఈ చర్యలు తీసుకున్న తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.
