కేంద్ర ప్రభుత్వం ముందుగా రైతులకు హామీ ఇచ్చినట్టుగా కనీస మద్దతు ధరపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సంయుక్త కిసాన్ మోర్చా నుంచి ముగ్గురు సభ్యులను తీసుకోంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కనీస మద్దతు ధరపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కనీస మద్దతు ధరతోపాటు ఇతర సాగు సంబంధ సమస్యలనూ పరిష్కరిస్తుంది. ఈ ప్యానెల్‌కు చైర్మన్‌గా మాజీ వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్‌ను కేంద్రం నియమించింది.

ఈ కమిటీ సహజ సాగు, క్రాప్ డైవర్సిఫికేషన్, కనీస మద్దతు ధరను ప్రభావశీలంగా, పారదర్శకంగా పని చేస్తుంది. జులై 12వ తేదీన కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ కమిటీలో సంయుక్త కిసాన్ మోర్చా నుంచి ముగ్గురు సభ్యులను చేర్చనుంది. వీరు ఎంఎస్పీ కమిటీలో అంతర్భాగంగా ఉంటారు. ఈ కమిటీలో చేర్చడానికి ముగ్గురు సభ్యుల పేర్లు పంపించాలని సంయుక్త కిసాన్ మోర్చాను కేంద్రం కోరినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కావాలన్న రైతుల డిమాండ్‌ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గతేడాది నవంబర్‌లో సాగు చట్టాలు వెనక్కి తీసుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కమిటీ ఏర్పాటు చేయడానికే కట్టుబడి ఉన్నట్టు వివరించారు.

సంజయ్ అగర్వాల్ చైర్మన్‌గా ఉంటే.. నీతి అయోగ్ మెంబర్ (వ్యవసాయం) రమేష్ చంద్,, అగ్రికల్చర్ ఎకనామిస్ట్‌గా డాక్టర్ సీఎస్సీ శేఖర్, ఐఐఎం అహ్మదాబాద్‌లో సేవలు అందిస్తున్న డాక్టర్ సుఖ్‌పాల్ సింగ్ తెలిపారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైతు కేటగిరీలో భరత్ భూషణ్ త్యాగి ఉన్నారు. అలాగే, ముగ్గురు సభ్యులు రైతుల (సంయుక్త కిసాన్ మోర్చా) నుంచి ప్రతిపానిధ్యం వహించనున్నారు. ఇతర రైతు సంఘాల నుంచి గున్వంత్ పాటిల్, క్రిష్ణవీర్ చౌదరి, ప్రమోద్ కుమార్ చౌదరి, గుని ప్రకాశ్, సయ్యెద్ పాషా పాటిల్‌లు ఈ ప్యానెల్‌లో ఉంటారు.