Rakesh Tikait : దేశంలో పండుతున్న మొత్తం వరి ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ సరైందనీ, ఈ నిరసనలకు తన మద్దతు ఉంటుందనీ... నిరసన వేదికగా మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
paddy procurement issue: ధాన్యం సేకరణ అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన వరిని కేంద్ర ప్రభుత్వం సేకరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) చేపట్టిన నిరసనకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ మద్దతు తెలిపారు. నిరసనల్లో పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు చేస్తున్న ఈ డిమాండ్ సరైందనీ, వరి కొనుగోలుకు సంబంధించి ఏకరూప విధానం అవసరమని అన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తనకు అర్థం కావడం లేదనీ పేర్కొన్న ఆయన.. ఏకరూప సేకరణ విధానం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న డిమాండ్‌కు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ధాన్యం నిల్వలను కొనుగోలు చేయలేకపోతే, రైతులు తమ నిల్వలను వ్యాపారులకు విక్రయించినందుకు నష్టాన్ని భరించాల్సి వస్తున్నదని తెలిపారు.
రైతులు జాతీయ వినియోగానికి అవసరమైన పంటలను సాగు చేస్తారు.. కాబట్టి అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని తెలిపారు. తెలంగాణ రైతులకు బేషరతుగా మద్దతు ఇస్తామనీ, దేశవ్యాప్తంగా రైతులకు అండగా ఉంటామని టికాయత్ తెలిపారు. ఇతర రైతు సంఘాల నాయకులతో పాటు తాను కూడా నిరసనలో పాల్గొంటాననీ.. నిరసన మాత్రమే కాదు, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు మేము మద్దతు ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను పొడిగించినందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన ఆయన.. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా దీనిని పునరావృతం చేయాలన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రతిపాదిస్తున్నందున ఈ నిబంధనలు రైతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రతిపాదిత నిబంధనలు రైతులకు అనుకూలంగా లేవు మరియు అవి విద్యుత్ ఛార్జీలను పెంచుతాయని తెలిపారు.
పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాని తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగం కూడా దెబ్బతింటున్నదని రాకేష్ టికాయత్ అన్నారు. ఇది నేరుగా రైతులపై ప్రభావం చూపకపోయినా, వ్యవసాయ పద్ధతులపై పరోక్ష ప్రభావం చాలా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎన్నికల సమయంలో ఇంధన ధరలు పెరగవు కానీ ఫలితాలు వెలువడిన వెంటనే ధరలు పెరుగుతాయంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో జరిగిన ఆందోళనల సమయంలో చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆందోళనల్లో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసినా కేంద్రం నుంచి నేటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడాన్ని స్వాగతిస్తున్నామనీ, హర్యానా మరియు పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటికే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించాలని నిర్ణయించయని తెలిపారు. అయితే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సహాయాన్ని ప్రకటించకపోవడం దారుణమని అన్నారు.
