ఆగస్టు 15వ తేదీ నుంచి రూ. 50కే రిటైల్‌గా కిలో టమాటలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీలను ఆదేశించింది. టమాట ధరలను సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి ఈ చర్యలు తీసుకుంది. 

న్యూఢిల్లీ: టమాటా సెగల నుంచి ఇప్పుడిప్పుడే ఊరట లభిస్తున్నది. కిలో టమాట ధర డబుల్ సెంచరీ దాటడం చూశాం. అకల వర్షాలకు పంట నష్టపోవడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి కారణాలతో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ, ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లోని టమాట పంట చేతికి వచ్చింది. అవి మార్కెట్లకు తరలివస్తుండటంతో ధరలు అదుపులోకి వస్తున్నాయి. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 15 నుంచి కిలో టమాట రిటైల్‌గా రూ. 50కి మించకుండా విక్రయాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: దిగివచ్చిన టమాట ధరలు.. హైదరాబాద్ రైతు బజార్‌లో కిలో టమాట రూ. 39

నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రూ. 50కే రిటైల్‌గా కిలో టమాటాలు అమ్మాలని పేర్కొంది. మార్కెట్‌లో కొండెక్కిన టమాట ధరలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

జూన్‌లో భారీ కురిసిన వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లలో పండించిన పంట నష్టపోయింది. దీంతో ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఎగుమతి చేసే కమీషన్ ఏజెంట్లు రేట్లు భారీగా పెంచేశారు. వాస్తవానికి ఈ ఏడాది తొలినాళ్లలో కిలో టమాట ధర రూ. 10 నుంచి రూ. 20గా ఉండింది. కానీ, ఆ తర్వాత కృత్రిమ కొరత కూడా సృష్టించి డబుల్ సెంచరీకి దగ్గరగా రేట్లను తీసుకెళ్లారు.

తాజాగా, రైతు బజార్‌ లో కిలో టమాట ధర రూ.39కి పలికింది. రిటైల్ దుకాణాలు, కాలనీలలో కిలో టమాటకు రూ. 50 నుంచి రూ. 60 వరకు పడే అవకాశాలు ఉన్నది. అంతేకాదు, త్వరలోనే టమాట ధరలు మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్న ట్టు కొన్ని వర్గాలు వివరించాయి.