ఈ డ్రగ్స్‌ను ‘ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ)’ క్యాటగిరీలో చేర్చాలని కేంద్రం యోచిస్తున్నది.
చాలా కొద్ది మందులు మినహా.. దాదాపు ఎలాంటి మందులు కొనాలన్నా డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. అయితే... కొన్ని రకాల మందులను మాత్రం.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే కొనుగోలు చేసేలా.. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు తీసుకురానుంది.
దగ్గు, జలుబు, నొప్పులు, చర్మంపై దురద వంటి వాటికి సాధారణంగా వినియోగించే పారాసిటమాల్, నాసల్ డికంజేస్టెంట్స్, యాంటీ ఫంగల్స్ వంటి 16 ఔషధాలు త్వరలో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా అందుబాటులోకి రానున్నాయి. ఈ డ్రగ్స్‌ను ‘ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ)’ క్యాటగిరీలో చేర్చాలని కేంద్రం యోచిస్తున్నది.
ఈ మేరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరాన్ని మినహాయిస్తూ 16 ఔషధాలను షెడ్యూల్-కే కింద కు తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డ్రగ్స్ రూల్స్-1945కి సవరణలు ప్రతిపాదించింది.
దీనికి సంబంధిత భాగస్వామ్య పక్షాలు అభిప్రాయాలు చెప్పేందుకు నెల సమయం ఇస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే లైసెన్స్ ఉన్న రిటైలర్ దుకాణాదారులు ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా కౌంటర్‌లోనే రోగులకు ఐదు రోజులకు సరిపడా మించకుండా ఆయా ఔషదాలను అమ్మేందుకు అనుమతి ఉంటుంది.
