చైనా, యూఎస్‌లలో కోవిడ్ కొత్త వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాలను కోవిడ్ నియంత్రణ చర్యలను తగ్గించవద్దని హెచ్చరించింది.
చైనా, యూఎస్‌లలో కోవిడ్ కొత్త వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. రోజువారిగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అయితే బయటి దేశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఐదు రాష్ట్రాలను కోవిడ్ నియంత్రణ చర్యలను తగ్గించవద్దని హెచ్చరించింది. ఈ మేరకే ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.
‘ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివిధ చర్యలను చేపడుతున్నందున.. కోవిడ్ నియంత్రణ కోసం రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉంది’’ అని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయడం.. కోవిడ్ నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని కొనసాగించాలని సూచించారు. కేంద్రం లేఖలు రాసిన వాటిలో.. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.
-గత వారంలో కేరళలో 2,321 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 31.8 శాతం. రాష్ట్రంలో వీక్లీ పాజిటివిటీ రేటు 13.45 శాతం నుంచి 15.53 శాతానికి పెరిగింది.
-ఢిల్లీలో ఏప్రిల్ 1తో ముగిసి వారంలో 724 కొత్త కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి కొత్త కేసుల సంఖ్య 826కి పెరిగింది. ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 11.33 శాతం. గత వారంలో కరోనా పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది.
-హర్యానాలో ఏప్రిల్ 1తో ముగిసి వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి కొత్త కేసుల సంఖ్య 416కి పెరిగింది. ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 5.70 శాతంగా ఉంది. రాష్ట్రంలో గత వారంలో కరోనా పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగింది.
-మహారాష్ట్రలో గత వారం రోజుల్లో 794 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది భారతదేశంలోని కొత్త కేసుల్లో 10.9 శాతంగా ఉంది. రాష్ట్రంలో గత వారంలో కరోనా పాజిటివిటీ రేటు 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది.
-మిజోరంలో గత వారం రోజుల్లో 814 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది భారతదేశం యొక్క కొత్త కేసులలో 11.16 శాతంగా ఉంది. గత వారంలో కరోనా పాజిటివిటీ రేటు 14.38 శాతం నుండి 16.48 శాతానికి పెరిగింది.
