ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఓ స్పష్టత ఇచ్చింది. బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలనే ప్రతిపాదనలేమీ లేవని చెప్పింది.
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా ఎన్నికల ఫలితాలు రాగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ పని తీరుపై సంచలన ఆరోపణలు రావడం సాధారణ విషయమైపోయింది. కొన్ని పార్టీల నేతలైతే మళ్లీ బ్యాలెట్ విధానాన్ని తేవాలని డిమాడ్ చేశారు కూడా. అంతేకాదు, ఈవీఎం విధానం కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగడమే సమంజసమని, ఎంతో పటిష్టమైన వ్యవస్థలకూ హ్యాకింగ్ ముప్పు ఉంటుందనే వాదనను తెర మీదికి తెచ్చారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇంకా బ్యాలెట్ విధానాన్నే అమలు చేస్తున్నాయనీ ఇంకొందరు వాదించారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనే ఆసక్తి ఉండనే ఉన్నది. తాజాగా బ్యాలెట్ ఎన్నికల విధానం పునరుద్ధరించడంపై పార్లమెంటులో కేంద్రం ఓ స్పష్టత ఇచ్చింది.
బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలేవీ లేవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం లోక్ సభలో వెల్లడించారు. బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని కొందరు ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఎన్నికల సంఘం ద్వారా తెలిసిందని ఆయన వివరించారు. 1982 నుంచి ఎన్నికల సంఘం ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఓటింగ్ మెషీన్, ఓటర్ వెరిఫయేబుల్ పేపర్ ఆడిట్ ట్రేల్ మెషీన్లను 1951 ప్రజా ప్రాతినిధ్య నిబంధనల రూపంలో పార్లమెంటు ఆమోదం తెలిపిందని వివరించారు.
Also Read: ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నదని భార్యను చంపిన భర్త.. ఆమె తండ్రీ సహకరించాడు!
అంతేకాదు, ఈవీఎంల వినియోగానికి సంబంధించిన చట్టంపై అనేక జ్యూడీషియల్ రివ్యూలు ఇచ్చారని , సుప్రీంకోర్టు కూడా అనేక కేసులను విచారించిందని తెలిపారు. ఇప్పటి వరకైతే బ్యాలెట్ విధానానికి మారాలనే ప్రతిపాదనలు లేవని వివరించారు.
