న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం సోమవారం నాడు మరో కీలక నిర్ణయం తీసుకొంది. వ్యాక్సిన్ వృధాను అరికట్టేందుకు వీలుగా 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కరోనా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. టీకాల కోసం ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారు ఆ రోజున టీకా వేయించుకోవడానికి రాలేకపోతే ఆ టీకా వృధాగా మారిపోతోంది. ఈ వృధాను అరికట్టేందుకు గాను  18 ఏళ్ల నుండి 44 ఏళ్ల వయస్సున్న వారికి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం నాడు ప్రకటించింది. 

మొబైల్ పోన్స్ వాడడం తెలియని వారితో పాటు  ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి రిజిస్ట్రేషన్  చేసుకొనే అవకాశం కల్పిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  అయితే ఈ విషయమై ఆయా రాష్ట్రాలు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. 18 నుండి 44 ఏళ్ల లోపు వారికి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తే  ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ప్రైవేట్ కేంద్రాల వద్ద వాక్ ఇన్ నమోదులు వద్దని కేంద్రం సూచించింది. 

ఈ నెల 1 నుండి 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే కోవిన్ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్రం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ మేరకు  వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో 18 ఏళ్లు పైబడిన వారికి చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందివ్వడం లేదు.