న్యూఢిల్లీ: వలస కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులకు కూడా ఊరట లభించింది. వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇరు రాష్ట్రాలు సంప్రదించుకుని వారిని అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలువుతన్న స్థితిలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్వస్థలాలకు చేరుకోవడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. సొంత రాష్ట్రానికి చేరుకున్న తర్వాత వారిని హోం క్వారంటైన్ లో పెట్టాలని కూడా ఆదేశించింది. ఆరోగ్య సేత యాప్ ద్వారా అందరినీ ట్రాక్ చేయాలని ఆదేశించింది.

వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిని ప్రత్యేక బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించాలని కూడా సూచించింది. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని కూడా సూచించింది.

ఇదిలావుంటే ఉంటే, దేశంలో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తూనే ఉంది. తాజాగా, గత 24 గంటల్లో 73 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య వేయి దాటింది. మొత్తం 1007 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు రికార్డు కావడం ఇదే తొలిసారి. 

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 31,332కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.  ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7,696 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో మహమ్మారికి కళ్లెం పడడం లేదు. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,500 సంఖ్యను దాటింది. గుజరాత్ 3,548 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

ఇదిలావుంటే, ఢిల్లీలోని సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ లో 46 మందికి కరోనా వైరస్ సోకింది. కాగా, ఒక జవాను కోవిడ్ -19తో మంగళవారంనాడు మరణించాడు. బెటాలియన్ లోని దాదాపు వేయి మందిని క్వారంటైన్ కు తరలించారు.

గత రెండు రోజులుగా తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ లో గల 31వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో అకస్మాత్తుగా కరోనా వైరస్ విజృంభించింది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన జవాన్లకు ఢిల్లీలోి మండవాలిలో చికిత్స అందిస్తున్నారు. 55 ఏళ్ల జవాను మంగళవారంనాడు సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో మరణిించాడు. 

సిఆర్పీఎఫ్ జవానుకు ఈ నెల ప్రారంభంలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. బెటాలియన్ లో చేరిన ఆ జవానుకు 17వ తేదీన ఆ లక్షణాలు కనిపించగా, 21వ తేదీన అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతన్ని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. 

ఏప్రిల్ 24వ తేదీన బెటాలియన్ లోని తొమ్మిది సిఆర్పీఎఫ్ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడు 15 మందికి పాజిటివ్ వచ్చింది.