భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు ఇండియన్ రైల్వే ముందుకు వచ్చింది. వరద బాధితులకు సహకరించేందుకు రైల్వే ఉద్యోగులంతా తమ ఒకరోజు జీతాన్ని విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.

దేశవ్యాప్తంగా మొత్తం 16 జోన్లలో 13 లక్షలమంది రైల్వే ఉద్యోగులు ఉన్నారు. వీరు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే.. దాదాపు రూ. 200 కోట్ల భారీ సాయాన్ని అందించినట్టు అవుతుంది. మరోవైపు రైల్వేస్‌కు చెందిన పుణే డివిజన్‌ నిర్విరామంగా కేరళకు సాయం అందిస్తోంది. 

గతవారం కేరళకు 29 వ్యాగన్ల మంచినీటిని సరఫరా చేసిన పుణె రైల్వే డివిజన్‌.. తాజాగా మంగళవారం నాలుగు టన్నుల సహాయక సామాగ్రిని తిరువనంతపురం పంపింది. వర్షాలతో మూతపడిన కొచ్చి ఎయిర్‌పోర్టు ఈ నెల 26వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కేంద్రం తరఫున సహాయక చర్యల్లో నిమగ్నమైన కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్‌ మంగళవారం రాత్రి చాంగనచెర్రీ సహాయక శిబిరంలో బస చేశారు. సహాయక శిబిరంలో తాను పడుకున్న ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు.