శుక్రవారం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగం గురించి  లేఖలో  కేంద్రం వివరించింది. 

18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ అని కేంద్రం తెలిపింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్‌లో గర్భవతి, బాలింతలను భాగం చేయలేదని.. లబ్ధిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఏ టీకా అయితే మొదటి డోసు తీసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.