సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సీబీఎస్‌ఈ కీలక హెచ్చరిక జారీ చేసింది.
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సీబీఎస్‌ఈ కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం చాట్ జీపీటీ టెక్నాలజీ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత చాట్ జీపీటీని ఉపయోగించడాన్ని నిషేధించినట్టుగా బోర్డు తెలిపింది. ఎగ్జామ్ హాల్స్ లోపల ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వినియోగాన్ని సీబీఎస్‌ఈ బోర్డు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ హాల్స్‌లో చాట్ జీపీటీ (ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించింది.
చాట్ జీపీటీ సంక్లిష్ట ప్రశ్నలకు సెకన్లలో సమాధానాలు పొందడానికి సాయపడుతుంది. అలాగే గణిత సమస్యలను కూడా పరిష్కరించగలదు. చాలా సంక్లిష్టమైన మ్యాథ్స్ ను కూడా సులభతరం చేసేలా ఇది పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ 10,12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మొబైల్, చాట్ జీపీటీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్‌లోకి అనుమతించరని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు ఉల్లంఘించి చాట్ జీపీటీతో పట్టుబడితే.. పరిణామాలను భరించవలసి ఉంటుందని హెచ్చరించారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అక్రమ మార్గాలను ఉపయోగించవద్దని విద్యార్థులను సీబీఎస్‌ఈ హెచ్చరించింది. పరీక్షల అడ్మిషన్ కార్డ్‌లో కూడా హెచ్చరిక సూచనను జతచేశారు. ‘‘మీరు ఎలాంటి అక్రమమైన ఆచరణలో పాల్గొనకూడదు. కనుగొనబడితే.. మీరు అన్‌ఫెయిర్ మీన్స్ (UFM) యాక్టివిటీ కింద బుక్ చేయబడతారు. బోర్డు నిబంధనల ప్రకారం చర్య తీసుకోబడుతుంది’’ అని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడిన నకిలీ వీడియోలు, సందేశాలను నమ్మవద్దని సూచించారు. పుకార్లను కూడా వ్యాప్తి చేయవద్దని కోరారు.
