కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలను శాంతింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపింది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

ఈ క్రమంలో రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు.

రైతులకు పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు. టైమ్, డేట్ ఖరారు చేసుకొని రైతులు చర్చలకు రావాలని ఆయన కోరారు.  

మరోవైపు వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామంటూ కేంద్రం పదేపదే చెబుతుండటం ఆపాలని రైతు సంఘాల నేతలు బుధవారం అన్నారు. కేంద్రం ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను తిరస్కరించిన విషయం తెలిసిందే.

నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమేనంటూ రైతులు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాసింది.