దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన దస్త్రాలపై కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. అయితే దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్‌ల (ఎంసీడీ) విలీనానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ ఆర్డినెన్స్ త్వరలోనే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఒకటి కాగా.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రెండోది. ఇక మూడోది దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ మూడు మున్సిపాలిటీలు ఒకే పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడనున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విలీన ప్రక్రియ పూర్తయిన తరువాతే ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మూడు మున్సిపాలిటీలు విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ వ్యతిరేకిస్తూనే ఉంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని పదే పదే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై ఆప్ స్పందించింది. ‘‘ మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల ఓటమి నుంచి రక్షించబడుతుందని భావిస్తుంది. కానీ అది ఆపోహ మాత్రమే. ఢిల్లీ ప్రజలు త్వరలోనే ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న అపోహను తొలగిస్తారు. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడం బీజేపీకి అసాధ్యం.’’ అంటూ పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో ఈ మూడు పౌర సంస్థల విలీన నిర్ణయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏడెనిమిదేళ్లుగా అధికారంలో ఉంది. ఈ మూడు మున్సిపాలిటీలను కలిపివేయాలని భావిస్తే.. వారు ఇన్నేళ్లలో ఈ పని ఎందుకు చేయలేదు. ? ఎంసీడీ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి కేవలం ఒక గంట ముందు ఈసీకి ఎందుకు లేఖ రాశారు ? ’’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
కాగా కేంద్రం జోక్యం లేకుండా ఎంసీడీ ఎన్నికలను నిర్వహించాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలేే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. దానికి కొన్ని రోజులు ముందు ఆప్ నాయకులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దుర్గేష్ పాఠక్ మాట్లాడుతూ.. మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికల తేదీలను ప్రకటించాలని పోల్ ప్యానెల్ షెడ్యూల్ చేసిందని తెలిపారు. అయితే పాలక బీజేపీ బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ ల కారణంగా దానిని వాయిదా వేసిందని తీవ్రంగా ఆరోపించారు. “ ఓటమి భయంతో MCD ఎన్నికలను వాయిదా వేయడానికి బీజేపీ చీప్ ట్రిక్స్ అవలంభించింది. ఎన్నికల కమిషన్ లాంటి సంస్థను బీజేపీ తన ప్రయోజనాల కోసం తారుమారు చేసింది’’ అని ఆయన ఆరోపించారు.
