ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)సోమవారం బాలాసోర్‌లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్‌లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది, అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో కనిపించకుండా పోయాడనే వార్తలు వస్తున్నాయి. 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రమాద అనంతరం కీలక అధికారి పత్తా లేకుండా పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత బహనాగా బజార్ స్టేషన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్ పరారీలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ పుకార్లను రైల్వే ఖండించింది. రైల్వే శాఖ ఇచ్చిన సమాచారంలో ఇది కేవలం పుకారు మాత్రమేనని పేర్కొంది. ఈ విషయంపై సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ..'బహనగాకు చెందిన ఓ ఉద్యోగి పరారీలో ఉన్నాడని, అదృశ్యమైనట్లు కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థ సీబీఐ ఎదుట మొత్తం సిబ్బంది హాజరు పరుస్తున్నారని తెలిపారు.

సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు !

బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ కొద్దిరోజుల క్రితం జేఈ అమీర్ ఖాన్‌ను విచారించింది. ఆ తర్వాత మళ్లీ అతడి ఇంటికి చేరుకున్న బృందం తాళం వేసి కనిపించింది. ఈ పరిణామం తర్వాత జేఈ ఇంటికి సీబీఐ సీలు వేసిందనే పుకార్లు వ్యాపించాయి. అయితే వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని, ఇందుకు రైల్వేశాఖ నిరాకరించింది. దర్యాప్తు పరిధిలోకి వచ్చే రైల్వే సిబ్బంది అంతా దర్యాప్తు సంస్థ సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నారని, తద్వారా ప్రమాదంపై పూర్తి క్లారిటీ వస్తుందని రైల్వే తెలిపింది.

సీబీఐ విచారణ 

బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సిస్టమ్ రైళ్ల స్థితి గురించి సమాచారాన్ని అందిస్తుంది. అధికారులు కూడా విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే సంబంధిత కేసులను నిర్వహించడంలో సీబీఐ అధికారులకు పెద్దగా అనుభవం లేనందున, దర్యాప్తు సాగుతున్న కొద్దీ రైల్వే భద్రత , ఫోరెన్సిక్ నిపుణుల నైపుణ్యం అవసరం కావచ్చు.

రైల్వే స్టేషన్ సీల్ 

సిబిఐ దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, "లాగ్ బుక్", "రిలే ప్యానెల్" ,ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని బహనాగ బజార్ స్టేషన్‌కు సీలు వేశారు. రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్ కూడా మూసివేయబడింది. దీని ఫలితంగా సిగ్నలింగ్ సిస్టమ్‌కు ఉద్యోగి యాక్సెస్ నిలిపివేయబడింది. తదుపరి నోటీసు వచ్చే వరకు బహనాగ బజార్ స్టేషన్‌లో ప్యాసింజర్ లేదా గూడ్స్ రైళ్లు ఆగవు. తత్ఫలితంగా బహనాగా స్టేషన్‌లో అన్ని రైలు కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బాలాసోర్‌లో జరిగిన రైలు విషాదంలో బహనాగ బజార్‌లోని స్టేషన్ మాస్టర్‌తో సహా ఐదుగురు రైల్వే ఉద్యోగుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. సిగ్నలింగ్ సంబంధిత పనికి మరో నలుగురు ఉద్యోగులు బాధ్యత వహిస్తున్నారని, ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారని తెలుస్తోంది.

292కి చేరిన మృతుల సంఖ్య

షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఒక గూడ్స్ రైలు ఒక్కదానికొకటి ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం భారతదేశపు అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా వర్ణించబడింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ క్రమంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు పక్క ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఆ కోచ్ లను ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 292కి పెరిగిందని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రయాణీకుడు కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఒక అధికారి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 287 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించగా, 1,208 మంది గాయపడ్డారు.