Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం: ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం బహనాగా బజార్ స్టేషన్‌ను సీల్ చేసింది. సీబీఐ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బహనాగా బజార్ స్టేషన్‌లో ఏ రైలు ఆగదు
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2న ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై అనేక ఆరోపణలు, సందేహాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ బాధాకరమైన రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తాజాగా దర్యాప్తు లో నిమగ్నమైన సీబీఐ బృందం బహనాగా బజార్ స్టేషన్‌ను సీల్ చేసింది. ఈ స్టేషన్ సమీపంలోనే ప్రమాదం జరిగింది. తదుపరి ఆదేశాల వరకు స్టేషన్‌లో ఏ రైలు ఆగదని అధికారులు తెలిపారు.దర్యాప్తులో భాగంగా లాగ్ బుక్, సామగ్రితో పాటు స్టేషన్ ను కూడా సీల్ వేసింది. అంతకుముందు.. బహనాగ బజార్ స్టేషన్‌లో కనీసం ఏడు రైళ్లు ఆగేవి.
'లాగ్ బుక్స్', 'రిలే ప్యానెల్స్', ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న తర్వాత స్టేషన్‌ను సీబీఐ సీల్ చేసినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఇఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి మీడియాకు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..“రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్ సీలు చేయబడింది. దీని కారణంగా సిగ్నల్ సిస్టమ్‌కు సిబ్బంది యాక్సెస్ నిలిపివేయబడుతోంది. తదుపరి నోటీసు వచ్చే వరకు బహనాగ బజార్ స్టేషన్‌లో ఏ ప్యాసింజర్ రైలు లేదా గూడ్స్ రైలు ఆగదు. అని తెలిపారు.
బహనాగ బజార్ రైల్వే స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 170 రైళ్లు ప్రయాణిస్తున్నాయని, అయితే భద్రక్-బాలాసోర్ మెము, హౌరా భద్రక్ బగ్జతిన్ ఫాస్ట్ ప్యాసింజర్, ఖరగ్‌పూర్ ఖుర్దా రోడ్ ఫాస్ట్ ప్యాసింజర్ వంటి రైళ్లు మాత్రమే స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతాయని అధికారి తెలిపారు. గాయపడిన 1,208 మందిలో 709 మందికి రైల్వే ఎక్స్‌గ్రేషియా అందజేసినట్లు చౌదరి తెలిపారు. జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 1,208 మంది గాయపడ్డారు. ఈ మేరకు రైల్వే అధికారి వెల్లడించారు
ఇదిలా ఉండగా.. దేశ జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒడిశా రైలు ప్రమాదంపై విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్‌లతో సహా పౌర సమాజంలోని ప్రముఖ సభ్యుల బృందం శనివారం (జూన్ 10) ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై 270 మంది సంతకాలు చేశారు.
ఆ లేఖలో.. “ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం వల్ల మేము తీవ్రంగా కలత చెందాము, దీనిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, ఆధునిక రైల్వేలు దెబ్బతిన్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. ప్రాథమిక మీడియా నివేదికల ప్రకారం.. మానవ జోక్యం వల్ల పట్టాలు తప్పినట్లు అనుమానిస్తున్నారు, ఇది ఉగ్రవాద సంస్థల ఆదేశానుసారం కుట్రకు స్పష్టమైన కేసుగా కనిపిస్తోంది." అని పేర్కొన్నారు.
