సారాంశం
డిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా ప్రభుత్వ సమ్మతి మరియు డిఓపిటి (భారత ప్రభుత్వం) తదుపరి ఉత్తర్వుల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ బృందం మంగళవారం రోజున బాలసోర్‌లో రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించింది. అక్కడ పలువురి నుంచి వివరాలను సేకరించింది. ఈ ప్రమాదానికి సంబంధించి జూన్ 3న బాలసోర్ జీఆర్పీఎస్ నమోదు చేసిన కేసు నెంబర్ 64 కేసు దర్యాప్తును సీబీఐ స్వాధీనం చేసుకుంది.
అంతకుముందు.. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే చట్టం 1989, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఒడిశా ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ప్రథమ సమాచార నివేదిక నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం.. రైల్వే చట్టంలోని సెక్షన్లు 154, 175, 153, భారతీయ శిక్షాస్మృతిలోని 337, 338, 304 A, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
ఈ ఘోర ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. “ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు” వల్లే ప్రమాదం జరిగిందని కూడా మంత్రి చెప్పారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అనేది సిగ్నల్ ఉపకరణం అమరిక. ఇక, ఈ ప్రమాదంపై రైల్వేశాఖ కూడా విచారణ జరుపుతోంది.
ఇక, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. లూప్ లైన్‌లో నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు విచ్చలవిడిగా పడిపోయాయి. కొన్ని కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పైకి పడ్డాయి. అదే సమయంలో యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టడంతో.. ఆ రైలులోని కొన్ని బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఇక, శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలాసోర్‌లో ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.