గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేయడానికి గాను లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్  మేనేజర్ సీబీఐకి దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రేవారి జిల్లా కుష్పురాలో డెయిరీ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ.24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది.

దీనిలో భాగంగా గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి విడతగా రూ.7.92 లక్షలను బ్యాంక్ మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్ లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు.

ఈ మొత్తాన్ని మధ్యవర్తికి అప్పగించాలని నిందితులు బాధితుడిని కోరారు. దీంతో అతను సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా బ్యాంక్ మేనేజర్ సుమేర్ సింగ్, మధ్యవర్తిగా వ్యవహరించిన సతీశ్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.