ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విదేశీ నిధుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 

న్యూఢిల్లీ: సామాజిక సమస్యలపై పని చేసే ఆక్స్‌ఫామ్ సంస్థ భారత విభాగంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని అధికారులు తెలిపారు. ఫారీన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ కోణంలో ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోం శాఖ గురువారం సూచనలు చేసింది. ఈ తరుణంలోనే తాజాగా సీబీఐ ఆక్స్‌ఫామ్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఎఫ్‌సీఆర్ఏ చట్టం 2020 సెప్టెంబర్ 29న సవరించారు. దీని ప్రకారం, విదేశీ నిధులు పొందిన ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థ.. ఇతర ఎన్జీవోలకు నిధులను బదిలీ చేయరాదు. కానీ, ఆక్స్‌ఫామ్ ఇండియా విదేశీ నిధులను ఇతర సంస్థలకు బదలాయింపులు చేసినట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది.

పేదరికం, అసమానత, లింగ సమానత్వం, పర్యావరణ మార్పులు వంటి అంశాలపై ఆక్స్‌ఫామ్ పని చేస్తుంది. ఈ అంతర్జాతీయ సంస్థ ఇండియా విభాగం.. ఆక్స్‌ఫామ్ ఇండియాపై తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.

అయితే, తాము ఏ తప్పూ చేయలేదని, దర్యాప్తు అధికారులతో సహకరిస్తున్నామని ఆక్స్‌ఫామ్ ఇండియా వెల్లడించింది.

దర్యాప్తు చేయాలని సీబీఐకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆక్స్‌ఫామ్ ఇండియా స్పందించింది. భారత చట్టాలకు తాము లోబడే ఉన్నామని, ప్రతి షరతులకు లోబడే పని చేస్తున్నామని ఆక్స్‌ఫామ్ ఇండియా తెలిపింది. ఎఫ్‌సీఆర్ఏ రిటర్న్‌లు కూడా సకాలంలో చెల్లిస్తున్నామని వివరించింది.

Also Read: యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భేటీ.. ఎగుమతులు, ఉపాధి కల్పనపై చర్చ

2021 డిసెంబర్‌లో తమ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూ చేయాలేదని, తమ సంస్థ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశామని వివరించారు. తమ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోర్టు పేర్కొందని తెలిపారు.

ఆక్స్‌ఫామ్ ఇండియా ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ 2021లో రెన్యూ చేయడానికి హోం మంత్రిత్వ శాఖ నిరాకరించిన తర్వాత దానికి విదేశీ నిధులను బ్లాక్ చేశారు. విదేశీ నిధుల నిబంధనలు అతిక్రమించారని దాని లైసెన్స్‌ను రద్దు చేశారు.