తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన  కేరళ సిస్టర్ సిస్టర్ అభయ కేసులో దోషులకు జీవిత ఖైదు విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం నాడు తీర్పు ఇచ్చింది.

1992 మార్చి 27వ తేదీన కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. అభయ హత్య జరిగిన 28 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు దోషులకు శిక్ష విధించింది.రెండు రోజుల క్రితమే ఈ కేసులో ఇద్దరిని దోషులుగా సీబీఐ నిర్ధారించింది.

 

ఇవాళ ఈ ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధించింది. ఫాదర్ థామస్ కొట్టూరు, నన్ సెఫీకి జీవిత ఖైదును విధిస్తూ ఇవాళ తిరువనంతపురంలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది.

1992 మార్చి 27న ఫాదర్ కొట్టూరు, నన్ సెఫీల సన్నిహిత సంబంధాలకు సాక్షిగా ఉన్నారనే నెపంతో అభయను హత్య చేశారని సీబీఐ కోర్టులో రుజువు చేసింది.
తొలుత అభయ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే దీనిపై నిరసనలు రావడంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది.ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సీబీఐ సమర్పించింది. 

1993లో ఈ కేసు విచారణను సీబీఐ ప్రారంభించింది. 13 మంది అధికారులు ఈ కేసును విచారించారు. మూడు నివేదికను సీబీఐ కోర్టుకు అందించింది. తొలి నివేదికలో ఆత్మహత్యగా పేర్కొంది. రెండు నివేదికల్లో హత్యగా సీబీఐ ప్రకటించింది.

ఈ కేసు విచారణ ప్రారంభమైన 15 ఏళ్ల తర్వాత 2008లో నిందితులను అరెస్ట్ చేశారు. 2019 లో ఆగష్టులో విచారణ ప్రారంభమైంది. వంటగదిలో మృతురాలిని చంపేందుకు ప్రత్యర్ధులు ప్రయత్నించారని కొందరు సాక్ష్యాలను సీబీఐ సేకరించింది.