కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్‌ను సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. చైనీయులకు వీసాల మంజూరుకు సంబంధించిన అవినీతి కేసులో భాస్కర్ రామన్‌ను గత అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్టుగా సీబీఐ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్‌ను సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. చైనీయులకు వీసాల మంజూరుకు సంబంధించిన అవినీతి కేసులో ఎస్ భాస్కర్ రామన్‌ను చేసినట్టుగా సీబీఐ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం గత అర్ధరాత్రి భాస్కర్ రామన్‌ను అరెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నాయి. ఇక, మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు నగరాల్లో కార్తీ చిదరంబరంకు చెందిన ఇళ్లు, కార్యాలయ ప్రాంగణాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నైలో మూడు, ముంబైలో మూడు, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో ఒక్కొక్కటి చొప్పున.. మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లోని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిదంబరం అధికారిక నివాసాంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, చిదంబరం తనయుడు కార్తీపై దాఖలైన కొత్త అవినీతి కేసు విచారణలో భాగంగా మంగళవారం సోదాలు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో భారత వీసా పొందేందుకు 263 మంది చైనా పౌరుల నుంచి రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారని కార్తీపై ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌లోని తల్వాండి సాబో పవర్ ప్రాజెక్ట్ కోసం 2011లో చైనీస్ జాతీయుల వీసాను సులభతరం చేసినందుకు అక్రమంగా డబ్బులు పొందారనే ఆరోపణలపై కార్తీపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది.
ఇక, సీబీఐ సోదాలపై స్పందించిన కార్తీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఇప్పటివరకు ఇలా ఎన్నిసార్లు సోదాలు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు సీబీఐ సోదాలపై స్పందించిన చిదంబరం.. అధికారులు చెన్నైలోని తన నివాసం, ఢిల్లీలోని అధికారిక నివాసాల్లో తనిఖీలు చేశారని.. అయితే తనిఖీల సందర్భంగా సీబీఐ అధికారులు తనకు చూపిన ఎఫ్‌ఐఆర్ తనను నిందితుడిగా పేర్కొనలేదని చెప్పారు. తమ నివాసాల్లో చేపట్టిన సీబీఐ తనిఖీల్లో పత్రాలేవీ లభించలేదని, వారు ఏం సీజ్ చేయలేదని తెలిపారు.
