ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. సీబీఐ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నదని, అందుకే మనీశ్ సిసోడియా అరెస్టును తాము ముందే ఊహించామని పేర్కొంది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఈ రోజు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను కస్టడీలోకి తీసుకున్న నిమిషాల్లోనే ఆయనను అరెస్టు చేస్తామని ఊహించామని ఆప్ పేర్కొంది.
‘సీబీఐ పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నది. మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తుందని మాకు తెలుసు. ఈ ఎజెన్సీలు ఎలా పని చేస్తాయో ముందే పసిగట్టేయడం, ఊహించడం బాధాకరం’ అని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగపరుస్తున్నదన్న ఆప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘ఆయన విద్యా పరంగా మంచి పనులు చేసి ఉండొచ్చు.కానీ, దాని ఆధారం చేసుకుని లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడడని చెప్పలేం’ అని పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం : మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ
కాగా, ఆప్ నేత సంజయ్ సింగ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వాగ్దాడికి దిగారు. ‘మనీశ్ సిసోడియా అరెస్టు నియంతృత్వానికి పరాకాష్టం. మోడీ గారు, ఒక మంచి వ్యక్తి, ఉత్తమ విద్యా శాఖ మంత్రిని అరెస్టు చేసి మీరేం మంచి చేయలేదు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏదో ఒక రోజు తప్పకుండా మీ నియంతృత్వానికి తెర పడుతుంది’ అని ట్వీట్ చేశారు.
