వాడి వయసు పదేళ్లు కానీ.. కేవలం కళ్లు మూసి కళ్లు తెరిచేంత కాలంలో.. దాదాపు రూ.పది లక్షలు కాజేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ సంఘట మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జవాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక కో-ఆపరేటివ్‌ బ్యాంకులోకి ఉదయం 11గంటలకు జనాలు నిండిపోయి ఉన్న సమయంలో ఓ బాలుడు ప్రవేశించాడు. పిల్లిలా క్యాషియర్‌ ఉండే క్యూబికల్‌లోకి వెళ్లిన బాలుడు.. అక్కడున్న డబ్బు నోట్లను చక్కగా తన సంచిలో సర్దేసుకున్నాడు. కౌంటర్‌ ఎదురుగా లైన్లో నిల్చుని ఉన్న వారెవరికీ కూడా ఈ బుడతడు కనిపించలేదు. 

30సెకన్లు గడిచేలోపే తన పని పూర్తి చేసుకుని దర్జాగా బ్యాంకు నుంచి బయటికి వెళ్లిపోయాడు. గేటు బయట పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే గార్డుకు అనుమానం వచ్చి అతడి వెంట పడ్డాడు. అప్పటికే ఆ బాలుడు మాయమైపోయాడు. 

ఈ తతంగమంతా సీసీటీవీలో నమోదవడంతో వెలుగులోకి వచ్చింది. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగల బృందం తొలుత రెక్కీ నిర్వహించి.. తెలివిగా ఆ బాలుడితో చోరీ చేయించి ఉండచ్చని వారు పేర్కొన్నారు