గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌పై ఓ క్యాథలిక్ మతబోధకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ పారికర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. కాలుష్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినందుకు దేవుడే ఆయనను క్యాన్సర్‌తో శిక్షించాడని  క్యాథలిక్ ఆరోపించారు.

 ఈ మేరకు ఫాదర్ కాన్సికావ్ డి సిల్వా మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘దేవుని ఆగ్రహానికి గురైనవారికి శిక్ష తప్పదు...’’ అని ఆయన చెబుతున్నట్టు అందులో ఉంది.
 
బొగ్గు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై వాస్కోడిగామాలో వెల్లువెత్తుతున్న నిరసనలను పారికర్ పట్టించుకోలేదనీ... ఇదే ఆయన క్యాన్సర్ బారిన పడడానికి కారణమైందని ఫాదర్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఆందోళన చేశారు. బహిరంగ సభలు నిర్వహించారు. కానీ పారికర్ పట్టించుకోలేదు. ఆయన జేబులు మాత్రం నిండాయి. కాబట్టే దేవుడు ఆయనకు క్యాన్సర్ ఇచ్చాడు. అలా బాధపడుతూనే చనిపోయారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భయంకరమైన క్యాన్సర్. ఆయన చాలామందిని బాధపెట్టాడు..’’ అని డిసిల్వా పేర్కొన్నారు.