వెజ్ బిర్యానీలో ఎముకలు... రెస్టారెంట్ పై కేసు..!
అతను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే... ఆ వెజ్ బిర్యానీలో అతనికి ఎముకలు కనిపించడం గమనార్హం.

నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవారు.. అప్పుడప్పుడు అయినా వెజ్ తింటారు. కానీ.... ప్యూర్ వెజిటేరియన్స్ నాన్ వాసన కూడా భరించలేరు. అలాంటిది ఓ వ్యక్తి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే... అందులో ఎముకలు కనిపించాయి. అంతే...దెబ్బకు దడుచుకున్నాడు. వెంటనే ఆ రెస్టారెంట్ ఓనర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ రెస్టారెంట్ కి ఆకాశ్ దుబే అనే వ్యక్తి వెళ్లాడు. అక్కడ అతను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే... ఆ వెజ్ బిర్యానీలో అతనికి ఎముకలు కనిపించడం గమనార్హం.
వెంటనే అతను ఈ విషయమై రెస్టారెంట్ మేనేజర్, స్టాఫ్ కి ఫిర్యాదు చేశాడు. వారు అతనికి వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ... సదరు కష్టమర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీ పై సెక్షన్ 298 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం గమనార్హం.