వితంతు మహిళపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ ఘడ్ లో సంచలనం రేపింది. మహిళకు మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజ్‌ఘడ్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు జోహారి లాల్ మీనా ను...  రెండేళ్ల క్రితం ఓ వితంతు మహిళ కలిసింది. అనంతరం ఎమ్మెల్యే మీనా పలుసార్లు బాధిత వితంతవు ఇంటికి వచ్చి ఆమెపై పలు సార్లు అత్యాచారం చేశాడని స్థానిక కోర్టులో బాధితురాలు క్రిమినల్ కేసు పెట్టారు.

బాధిత వితంతవుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎమ్మెల్యే మీనా ఆమెను డాక్టరు వద్దకు తీసుకువెళతానని చెప్పి మెహందీపూర్ బాలాజీ పట్టణానికి తీసుకువెళ్లి ఆమెకు కొన్ని మందులు ఇచ్చారు. మందులు తీసుకున్న తాను అపస్మారక స్థితికి చేరుకోవడంతో మళ్లీ తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని, అత్యాచారాన్ని వీడియో తీశాడని బాధితురాలు కోర్టులో ఫిర్యాదు చేశారు. 

తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో బయటపెడతానని ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారని బాధిత వితంతవు ఆవేదనగా చెప్పారు. మళ్లీ మార్చి 24వతేదీన తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే మీనా తనపై అత్యాచారం చేశాడని బాధిత వితంతవు కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టు ఆదేశంతో సీబీసీఐడీ అధికారులు నిందితుడైన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.