రాయబరేలి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై ఆమె బామ్మ కమలా సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తన మనుమరాలు వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆగస్టు 10న కమలా సింగ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు  ప్రారంభించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపే బాధ్యతను అదనపు ఎస్పీ నిత్యానంద్ రాయ్‌కు అప్పగించారు.

అయితే ఇంత వరకు ఫిర్యాదు దారు, ఆమె కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.

కాగా మహరాజ్‌ గంజ్‌‌లోని లాలూపూర్ గ్రామంలో నివసించే 85 ఏళ్ల కమలా సింగ్ ... అదితి సింగ్, ఆమె బంధువులు తనను బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిసెంబర్ 30, 2019న తన ఇంట్లో ప్రవేశించి ఆస్తి మొత్తం వారి పేరిట బదిలీ చేయనుట్లయితే చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారన్నారు. ఇక ఈ విషయంపై అదితి సింగ్ ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా వుంటే... స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందినప్పటికీ ఇంత వరకు నమోదు చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అదితిపై ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

అదితి సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. పెద్దల్ని గౌరవించమని బీజేపీ చెప్పలేదా అని తమ పార్టీ నుంచి గెలుపొందని ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఇందుకు స్పందించిన యూపీ బీజేపీ కార్యదర్శి చంద్రమోహన్... సిగ్గుపడాలి, కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు వెంపర్లాడటం సరైంది కాదన్నారు. అదితి జీ ఏ పార్టీకి చెందినవారన్నది అప్రస్తుతమన్నారు.

కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను స్వస్థలానికి చేర్చేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు  చేసినట్లు యూపీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అధికార బీజేపీ ఆ బస్సుల జాబితాను తెప్పించుకుని పరిశీలించగా.. వాటిలో సగానికి పైగా కండిషన్‌లో లేని బస్సులే ఉన్నట్లు తేలింది. 297 బస్సులు తప్పుబట్టి ఉండగా.. 98 ఆటో రిక్షాలు, అంబులెన్స్ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి వున్నాయి.

ఇక మరో 68 వాహనాలకైతే అసలు పేపర్‌లేవు. ఇక ఈ విషయంపై ఘాటుగా స్పందించిన అదితి సింగ్ సొంత పార్టీ మీదే ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా..? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్ జోక్ కాదా ఇది అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.